తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5
‘జ్ఞాపకాలు గొప్పవి’
– కిరాక్ పార్టీలోని డైలాగ్ ఇది.
ఈ డైలాగేం కొత్తది కాదు. ఇప్పుడే వింటున్నదీ కాదు.
కానీ… నిజం!!
జ్ఞాపకాలు గొప్పవి. ఫొటోలకు అందరూ ఒకేలా ఫోజు ఇస్తారు. కానీ ఎవరి ఫొటో వాళ్లకు ప్రత్యేకం. ఎప్పుడో నాలుగైదేళ్ల తరవాత… అనుకోకుండా ఆ ఫొటో కంటపడినప్పుడు.. కళ్లలో ఓ మెరుపు వస్తుంది. జ్ఞాపకానికున్న విలువ అది. కాలేజీ కథలెప్పుడు జ్ఠాపకాలతో ముడిపడి ఉంటాయి. అందులో కొత్తదనం అక్కర్లెద్దు. మన జ్ఞాపకం తట్టిలేపితే చాలు. హ్యాపీడేస్ సినిమా అలా నిలబడిపోయిందంటే కారణం… గొప్ప కథ అని కాదు, జ్ఞాపకానికి ఉన్న విలువ అది. సేమ్ టూ సేమ్.. కిరాక్ పార్టీ కూడా కథని కాకుండా జ్ఞాపకాల్ని నమ్ముకుంది. కాలేజీ జీవితాల్ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. మరి ఆ జ్ఞాపకాలెలాఉన్నాయి?? కదిలించాయా, విసిగించాయా?
* కథ
కథగా చెప్పడానికి కిరాక్ పార్టీలో ఏమీ లేదు. చెప్పాంగా.. ఇదో జ్ఞాపకాల సమాహారం అని. కృష్ణ అనే కుర్రాడి కథ ఇది. నాలుగేళ్ల అతని ఇంజనీరింగ్ జీవితం ఇది. ఆ జీవితంలో చేసిన పొరపాట్లు, పరిచయమైన మిత్రులు, గుండెని గిల్లిన ప్రేమలు, కోట్లాటలు, తప్పుల్ని సరిదిద్దుకోవడాలూ.. ఇదే కథ. కాలేజీ గేటులోకి అడుగుపెట్టిన్పప్పటి నుంచీ డిగ్రీ పట్టా పుచ్చుకుని బయటకు వచ్చేంత వరకూ జరిగిన కథ ఇది.
* విశ్లేషణ
ఈ సినిమా కోసం కన్నడలో హిట్టయిన కిర్రిక్ పార్టీని రీమేక్ చేసుకున్నారు. నిజానికి కాలేజీ కథల కోసం అంతదూరం వెళ్లక్కర్లెద్దు. మన దగ్గర ఆడిన హ్యాపీడేస్ చూస్తే చాలు. అక్కడా ఇంజనీరింగ్ గాథలే. ఇక్కడా అదే కథ. అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది.. ఇక్కడా ఉంది. అంతెందుకు.. ఎవరి కాలేజీ జీవితాలు చూసినా ఇంచు మించుగా, కాస్త అటూ ఇటుగా ఇలానే ఉంటాయి. కిర్రిక్ పార్టీ ఏం గొప్ప కథ కాదు. కొత్త అంశమూ అందులో లేదు. జస్ట్… కాలేజీ కుర్రకారు అనుభవాల్ని.. తెరపైకి తీసుకొచ్చారంతే! కాలేజీలో స్నేహాలు, అమ్మాయిని పడేయడానికి వేసే ట్రిక్కులు, క్లాసుకి డుమ్మా కొట్టి కుంటి సాకులు చెప్పడం, అర్థరాత్రి ముసుగు వేసుకుని సీనియర్ రూమ్‌లో దూరి చావ బాదడం… ఇవన్నీ… రాసుకుంటే పుట్టే సీన్లు కాదు. అనుభవించాలి. ఇలాంటి అనుభవాలు ఎవరికి ఉన్నా… వాళ్లంతా కిరాక్ పార్టీతో బాగానే కనెక్ట్ అవుతారు.
ఏ సినిమాకైనా ఓ థ్రెడ్ ఉంటుంది. ఆ దారం చుట్టూనే సన్నివేశాలు అల్లుకుంటారు. కానీ ఈ కథలో ఆ థ్రెడ్ కనిపించదు. దర్శకుడు నమ్ముకున్నది సన్నివేశాల్ని మాత్రమే. `మీరా` అనే పాత్ర, అందులోంచి వచ్చిన ఎమోషన్ లేకపోతే.. దర్శకుడు అసలు కథ ఏం చెప్పాలనుకుని మొదలెట్టాడో అర్థం కాదు. ఓ లక్ష్యం, గమ్యం లేకుండా సాగే ప్రయాణం అయిపోదును. ఇంట్రవెల్ ముందు `మీరా` పాత్రని అలా ముగించకపోతే… కచ్చితంగా ఈ సినిమా గురించి రివ్యూ రాసేంత అవసరం వచ్చేది కాదు. ద్వితీయార్థంలోనూ అంతే. సినిమా మళ్లీ కాలేజీ చుట్టూనే తిరుగుతుంది. దర్శకుడు దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఏ సన్నివేశానికీ ప్రత్యేకించి లక్ష్యం ఉండదు. కృష్ణ వెళ్లి `మీరా` ఇంటి తలుపు తట్టే దాకా ఈ కథ… నానా రకాల ప్రయాస పడినట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్లీ ఎమోషన్ డ్రైవ్ మొదలవుతుంది. క్లయిమాక్స్‌లో హ్యాపీడేస్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం ప్రేమమ్ ఛాయలు కనిపిస్తాయి. కాకపోతే.. ఆ మేళవింపు కథని, సన్నివేశాలకు, పాత్రల తీరుకు తగినట్టు ఉండడంతో పాసైపోయింది.
* నటీనటుల ప్రతిభ
ఈమధ్య కాలంలో నిఖిల్లో ఇంత వేరియేషన్ చూడలేదు. తొలిసగం హ్యాపీడేస్‌లో నిఖిల్‌ని చూసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో మరీ రఫ్‌గా కనిపించాడు. కండలు పెంచాడు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నిఖిల్మీద పడిందేమో అనిపించింది. అయితే ఒక్కటి మాత్రం నిజం.. తన టాలెంట్ ని పూర్తిగా ఆవిష్కరించాడు. విశ్రాంతి ముందు కనీసం అయిదు నిమిషాలు నిఖిల్ ఒక్క డైలాగ్ కూడా మాట్లాడడు. తనలోని నిర్లిప్తత, నిరాశ, కసి.. అన్నీ కళ్లతోనే పలికించాడు. కథానాయికలిద్దరూ కొత్తవారే. వాళ్ల వల్ల సినిమాకి కాస్త ఫ్రెష్ లుక్ వచ్చింది. స్నేహితుల గ్యాంగ్‌లోనూ తెలిసిన మొహాలు లేవు. కానీ వాళ్లూ న్యాయం చేశారు. కాస్టింగ్ పరంగా వంకలు పెట్టడానికి ఏం లేదు.
* సాంకేతిక వర్గం
స్క్రీన్ ప్లే సుధీర్ వర్మ, డైలాగ్స్ చందూ మొండేటి అందించారు. అయితే వాళ్ల మార్కేం ప్రత్యేకంగా కనిపించదు. మెకానికల్ ఇంజనీర్స్, కంప్యూటర్ ఇంజనీర్స్ రెండు బ్యాచులూ ‘మేం గొప్ప.’ అంటే ‘మేం గొప్ప’ అని వాదించుకునే సీన్లకు ఇంజనీర్ స్టూడెంట్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సీన్లు ఒకట్రెండు పడితే బాగుణ్ణు. కాలేజీ కథల్లో.. ఎమోషన్స్ పండాలి. అలా పండాలంటే సన్నివేశాల్లో నిజాయతీ కనిపించాయి. అలా కనిపించే సందర్భాలు చాలా తక్కువగా వచ్చాయి. కొన్ని సీన్లు మరీ లెంగ్తీగా సాగాయి. ఇవన్నీ ప్రతికూల అంశాలే. కిర్రిక్ పార్టీని దాదాపుగా ఫాలో అయిపోయిన దర్శకుడు.. అక్కడి ఎమోషన్ని రీ క్రియేట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. పాటలు మరీ క్యాచీగా లేవు గానీ… నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది.
* తీర్పు
కాలేజీ కథల్లో హ్యాపీడేస్ రీసెంట్ ల్యాండ్ మార్క్. ఎమోషన్ సీన్లలో ప్రేమమ్‌ని చెప్పుకోవాలి. ఈ రెండు ఛాయలూ ఇందులో కనిపిస్తాయి. కానీ.. ఆ స్థాయిని అందుకొనేంత దమ్ము ఈ కథకు లేకుండా పోయింది. కానీ కాలేజీ కుర్రాళ్లని థియేటర్‌కి రప్పించే లక్షణాలు ఈ సినిమాకున్నాయి. ఈవారం కిరాక్ పార్టీకి పోటీ ఇచ్చే సినిమా లేకపోవడం కలిసొచ్చే విషయమే.
ఫినిషింగ్ టచ్: బ్యాకులాగున్నాయి కానీ.. పాసైపోయాడు
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5