పాపం నిఖిల్! తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘ముద్ర’ విడుదల కావడం లేదని, మరొకరు నటించిన ‘ముద్ర’ విడుదలవుతుందని రెండు రోజులుగా ట్విట్టర్లో నిఖిల్ నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. ఎవరూ అతని గోడు విన్నట్టు లేరు.
జగపతిబాబు, రావు రమేష్, పోసాని మురళీకృష్ణ తదితర తారాగణం నటించిన ‘ముద్ర’ శుక్రవారం విడుదలైంది. ‘బుక్ మై షో’ యాప్‌లో నటీనటుల జాబితాలో నిఖిల్ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు పొందుపరిచారు. ప్రేక్షకులు కొందరు నిఖిల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా.. నిఖిల్ ట్వీట్లు మీద ట్వీట్లు చేశాడు. నిర్మాతలు ‘బుక్ మై షో’ యాప్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది.
‘బుక్ మై షో’ యాప్‌లో నిఖిల్ సినిమా నటీనటుల పేర్లు తొలగించారు. జగపతిబాబు, రావు రమేష్ తదితరుల పేర్లు పెట్టారు. అయితే థియేటర్ల దగ్గర నిఖిల్ పోస్టర్ దర్శనం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో ఓ ఏషియన్ మల్టీప్లెక్స్‌లో నిఖిల్ ‘ముద్ర’ పోస్టర్ వేసి, 4.45 గంటలకు షో అని పేర్కొన్నారు. ఈ సంగతి తెలిసిన నిఖిల్ మరింత బాధపడుతున్నాడు. “ఇది దారుణం. చీటింగ్ లో పీక్స్ ఇది. వేరే మూవీ బదులు నా మూవీ పోస్టర్, పేస్ ఎలా పెడతారు?” అని ఆవేదన చెందాడు. ఒకే టైటిల్ తో ఒకే సమయంలో రెండు సినిమాలు రూపొందితే ఇటువంటి సమస్యలు వుంటాయన్నమాట.