నిఖిల్ కథానాయకుడుకిగా నటిస్తున్న చిత్రం ‘ముద్ర’. స్పష్టంగా చెప్పాలంటే ‘నిఖిల్ ముద్ర’. ఇదేంటి? అంటే… జగపతిబాబు కథానాయకుడిగా నటించిన ఓ చిత్రానిది ‘ముద్ర’ టైటిల్. నిఖిల్ కోసం టైటిల్ ఇవ్వడానికి ఆ చిత్ర దర్శకుడు, నిర్మాత అంగీకరించలేదు. చేసేది ఏమీ లేక తమిళ చిత్రం ‘కణితన్’కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి ‘నిఖిల్ ముద్ర’ టైటిల్ ఖరారు చేశారు.
టైటిల్ లోగోలో నిఖిల్ అనేది చిన్నగా డిజైన్ చేసి, ‘ముద్ర’ అనేది హైలైట్ చేశారు. దాంతో అందరూ టైటిల్ ‘ముద్ర’ అనే అనుకున్నారు. ఇదే నిఖిల్ చిత్రబృందానికి తలనొప్పి తెచ్చిపెట్టింది. ‘నిఖిల్ ముద్ర’ కంటే జగపతిబాబు ‘ముద్ర’ త్వరగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నెల 25న విడుదల. బుక్ మై షో, పేటీయం యాప్స్ లో ‘ముద్ర’ ఆర్టిస్టుల లిస్టులో నిఖిల్, లావణ్యా త్రిపాఠి పేర్లు పొందుపరిచారు. చాలామంది నిఖిల్ సినిమా అనుకుని టికెట్స్ బుక్ చేసుకున్నార్ట. కొందరు ఈ విషయాన్ని నిఖిల్ దృష్టికి తీసుకొచ్చారు. దాంతో “అది మా సినిమా కాదు. మా సినిమా ఈ వారం విడుదల కావడం లేదు” అని నిఖిల్ ట్వీట్లు చేశాడు. ‘నిఖిల్ ముద్ర’ నిర్మాత ఠాగూర్ మధు టికెట్ బుక్కింగ్ యాప్స్ కి దీనిపై ఫిర్యాదు ఇచ్చారు.
జగపతిబాబు కథానాయకుడిగా ‘ముద్ర’ అనే ఓ చిత్రంలో నటించారని, అది ఈ శుక్రవారం విడుదల అవుతుందని చాలా మందికి తెలియదు. నిఖిల్ పుణ్యమా అంటూ ఆ చిత్రానికి ప్రచారం లభించింది. ఇప్పటికే ‘నిఖిల్ ముద్ర’ టైటిల్ మార్చాలని అనుకున్నార్ట. త్వరగా టైటిల్ మార్చి కొత్త టైటిల్ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లకపోతే నిఖిల్ చిత్రాన్ని నష్టమే జరుగుతుంది.