నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం `ముద్ర`. డిసెంబరులో రావాల్సిన సినిమా ఇది. చిత్రీకరణలో జాప్యం వల్ల ఇప్పుడు మార్చికి షిఫ్ట్ అయ్యింది. ఈలోగా టైటిల్ కూడా మారింది. ఈ టైటిల్ నాదంటే నాదంటూ కొన్ని రోజులుగా నట్టికుమార్, `ముద్ర `టీమ్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు హీరోగా తీసిన సినిమాని `ముద్ర` అనే టైటిల్ తో నట్టికుమార్ విడుదల చేశారు. ఆల్రెడీ ఓ పేరుతో సినిమా ఉంది కదా అని… ఇప్పుడు నిఖిల్ సినిమా పేరుని మార్చేశాడు. ఈ చిత్రానికి `అర్జున్ సురవరం` అనే పేరు ఖరారు చేశారు. టి.సంతోష్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల యూరప్‌లో ఓ పాట తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సీజీతో ముడిపడి ఉన్నాయట. అందుకే విడుదలలో జాప్యం జరిగిందని చిత్రబృందం తెలిపింది.