ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నారు. అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని… పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని ఎస్ఈసీ ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని ఎస్ఈసీ గుర్తు చేసింది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమై.. మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మున్సిపల్ ఎన్నికలపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ఎస్ఈసీ ప్రకటించలేదు.
ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని.. కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని.. ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఆయన స్పష్టం చేశారు.కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమని చెబుతున్నారు. ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.
ఎస్ఈసీ బాధ్యతగా.. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని … 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ చెబుతున్నారు. అయితే నిమ్మగడ్డ ఆధ్వర్యంలో ఎలాంటి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేని ఏపీ సర్కార్.. నిమ్మగడ్డ ప్రకటనపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ పదవీ కాలం మార్చితో ముగిసిపోతుందని … ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఏపీ సర్కార్ అనుకుంటోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.