తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షాక్ ఇచ్చారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధమని తేల్చేశారు. రాజ్యాంగంలో 243కే ఆర్టికల్, పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించారు. మేరకు ఎస్ఈసీ జారీ చేసిన నోటీసులకు టీడీపీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదు. మేనిఫెస్టోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడా ప్రచారం చేయకూడదని.. జిల్లాలకు పంపినవి కూడా వెనక్కి తెప్పించుకోవాలన్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల పరంగా జరగవు. కానీ పార్టీ పరంగానే జరుగుతాయి. ప్రతీ గ్రామంలో పార్టీల సానుభూతి పరులే బరిలో నిలుస్తున్నారు. వారి వారి పార్టీ రంగులతోనే ప్రచారం చేస్తారు. కానీ.. చట్టం ప్రకారం.. పంచాయతీలకు రాజకీయాలు ఉండవు. ఈ కారణంగానే మేనిఫెస్టో చట్ట విరుద్ధంగా ఎస్ఈసీ ప్రకటించింది. గతంలోనూ తాము మేనిఫెస్టోను రిలీజ్ చేశామని టీడీపీ నేతలుచెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు కూడా కరెక్ట్ అని వారు వాదిస్తున్నారు. కానీ అప్పట్లో అదితప్పు అని ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అందుకే అప్పటి ఎస్ఈసీ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు.. వైసీపీ అదితప్పు అని గుర్తించి ఫిర్యాదు చేసింది.
సాధారణంగా ఎన్నికల నియామవళి ఉల్లంఘిస్తే… ఎస్ఈసీ కానీ ఈసీ కానీ తీసుకునే చర్యలు అంత కఠినంగా ఉండవు. మహా అయితే ప్రచారం నుంచి నిషేధించడం.. వివరణ తీసుకోవడం.. హెచ్చరికలు జారీ చేయడం వరకే ఉంటాయి. మరీ అత్యంత కఠినం అయితే కేసులు పెట్టమని ఆదేశిస్తారు. నంద్యాల ఉపఎన్నికల సమయంలో చంద్రబాబును కాల్చి చంపినా తప్పు లేదన్న జగన్ వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయి.. కేసులు పెట్టించింది. ఇప్పుడు టీడీపీ విషయంలో మేనిఫెస్టోను వెనక్కి తీసుకోమనే ఆదేశించింది. ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసే చాన్స్ ఉంది.