మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వార్ ప్రారంభమయింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నలభై నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వయంత్రాంగం సహకరించడం లేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిర్వహణపై పునరాలోచించాలని.. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా లేదని.. సీఎస్ నీలం సహానీ.. ఎస్ఈసీకి లేఖ రాశారు. అందులోనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవద్దని కూడా అన్నారు. దీంతో.. ఈ లేఖను తీుకుని.. వెళ్లి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదని.. హైకోర్టు ఆదేశాలను సీఎస్ నీలం సహానీ ఉల్లంఘిస్తున్నారని అధికారికంగా లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్ఈసీని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారని అందులో పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వ వాదనపై .. తన వెర్షన్‌ను నిమ్మగడ్డ వివరించినట్లుగా తెలుస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందని.. గణాంకాలను వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే.. ఏపీలో కరోనా కారణంగా.. ఏ ఒక్క కార్యకలాపాన్ని కూడా వాయిదా వేయలేదని.. మద్యందుకాణాల దగ్గర్నుంచి స్కూళ్ల వరకూ అన్నింటినీ ప్రారంభించారని.. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందన్న విషయాన్ని గవర్నర్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది.
తన లేఖపై గవర్నర్ స్పందించకపోయినా… ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు స్పందించకపోయినా… సహకరించకపోయినా.. నిమ్మగడ్డ మరోసారి హైకోర్టుకెళ్లే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే.. ఏపీలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.