హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్… అదే సమయంలో.. గవర్నర్‌కు, ఎన్నికల కమిషన్ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు. గతంలోనే ఆయన ఈ లేఖలు రాసినప్పటికీ.. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆ లేఖల విషయం ప్రస్తావించడంతో.. వెలుగులోకి వచ్చాయి. గవర్నర్‌తో పాటు… ఎన్నికల సంఘం కార్యదర్శిగా ప్రభుత్వం నియమించిన వాణి మోహన్‌కు.. నిమ్మగడ్డ .. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని లేఖ రాశారు. గవర్నర్‌కు రాసిన లేఖలో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
తన ఇంటి వద్ద.. పోలీసులను నిఘా పెట్టారని.. ఎక్కడకు వెళ్లినా పలువురు పోలీసులు వెంటాడుతున్నారన్నారు. విజయవాడలో ఉన్న తన తల్లిని చూసేందుకు కూడా వెళ్లలేకపోతున్నానన్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి.. తన విధులను నిర్వహించుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం లేదని.. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని వివరించారు. అయితే.. ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ఎన్నికల సంఘం కార్యదర్శి వాణి మోహన్ కు కూడా.. నిమ్మగడ్డ లేఖ రాశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఆ లేఖ రాశారు. న్యాయసలహాల పేరిట… తీర్పులను ఉల్లంఘిస్తున్నారని.. భవిష్యత్‌లో ఇబ్బంది పడతారని.. నిమ్మగడ్డ లేఖలో వాణిమోహన్‌కు తెలిపారు.
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గతంలో గవర్నర్‌ను ఆశ్రయిస్తారని.. ప్రచారం జరిగింది. అయితే.. ఆయన గవర్నర్‌కు లేఖ రాసినా బయటకు రాలేదు. ఇప్పుడు కోర్టులో ఆ లేఖలను సబ్మిట్ చేయడంతో వెలుగులోకి వచ్చాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వ్యూహాత్మకంగానే… తాను హైకోర్టు తీర్పును అమలు చేయాలని అన్ని వ్యవస్థలను కోరినట్లుగా చెప్పేందుకు ఈ లేఖలు ముందుగానే రాసినట్లుగా తెలుస్తోంది. అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుని చివరికి ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని తేల్చేలా కోర్టులో నిరూపించడానికి అవసరమైన పరిస్థితుల్ని తెచ్చుకున్న తర్వాతనే… నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు. పార్క్ హయత్ హోటల్ దృశ్యాలు వెలుగులోకి రాక ముందే… గవర్నర్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. అంటే.. ఆయనపై నిఘా పెట్టడం ద్వారానే.. ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయని కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.