సుదీర్ఘ న్యాయపోరాటంతో తన పదవిని మళ్లీ దక్కించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తాను రాసిన లేఖపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసు విషయంలో… హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ లేఖ ఎవరు రాశారనే విషయంపై దర్యాప్తు చేస్తూ.. కంప్యూటర్ను… డేటాను తీసుకెళ్లారని…అలా తీసుకెళ్లడం వెనుక.. అసలు లేఖ ఎవరు రాశారనే దానిపై దర్యాప్తు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని.. సీబీఐ విచారణ చేయించాలని.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకెళ్లడమే కాకుండా… పనికి రాని కంప్యూటర్ను ఫార్మెట్ చేసినందున.. ఉద్యోగిని వేధిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు బెదిరింపులు వచ్చాయి. వైసీపీ నేతలు నేరుగా.. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయనపై విరుచుకుపడ్డారు. దాంతో ఆయన పరిస్థితుల్ని వివరిస్తూ.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అయితే.. ఆ లేఖ నిమ్మగడ్డ రాయలేదంటూ… వైసీపీ నేతలు వాదన ప్రారంభించారు. తానే … కేంద్ర హోంశాఖకు రాశానని.. ధర్డ్ పార్టీ వ్యక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదంటూ… నిమ్మగడ్డ చెప్పినా… ప్రభుత్వం పట్టించుకోలేదు. నిమ్మగడ్డ లేఖను ఎవరు రాశారో తేల్చాలంటూ… ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు. ఆ లేఖ ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అప్పట్లో నిమ్మగడ్డ పీఎస్‌గా ఉన్న సాంబమూర్తిని అదే పనిగా గంటల తరబడి ప్రశ్నించింది. ఎస్ఈసీ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, డేటాను స్వాధీనం చేసుకుంది.
ఆ లేఖ తానే రాశానని చెప్పినా.. సంబంధం లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేయడమే కాకుండా.. విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం… డేటా అంతా తీసుకెళ్లడంపై .. అప్పట్లోనే విస్మయం వ్యక్తమయింది. అసలు ఎవరో ఎవరికో లేఖ రాస్తే.. ఆ లేఖపై ఇంకెవరో ఫిర్యాదు చేయడం ఏమిటి.? దానిపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమయింది. ఇప్పుడీ అంశాలపై… నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. తదుపరి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ లేఖ దర్యాప్తు అంశాన్ని.. ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో జోక్యం చేసుకుందనే కోణాన్ని జోడించారు. పిటిషన్లో దాన్నే ప్రధానంగా ప్రస్తావించారు.
ప్రస్తుతం ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయడానికి అవసరమైన సరంజామా ఆ పిటిషన్లో ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలా చూసినా సీఐడీ కేసు దురుద్దేశపూర్వకమేనని స్పష్టమవుతున్నందున.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందున.. ఇప్పటి వరకూ ఆ ప్రక్రియను రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏడో తేదీన జరగనుంది. కోర్టు తీర్పును బట్టి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.