ఎన్నికలు బహిష్కరిస్తామని ప్రకటనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగుల అభ్యంతరాలన్నీ.. తమ దృష్టికి వచ్చాయని.. పోలింగ్ సిబ్బంది భద్రతకు.. పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆ లేఖలో ఎస్ఈసీ వివరించారు. ఎన్నికల ప్రొసీడింగ్స్లోనే ఉద్యోగులకు జాగ్రత్తలు సూచించామన్నారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్ ఇవ్వాలని సూచించామని.. అలాగే.. వ్యాక్సినేషన్లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరామన్నారు. సీఎస్తో జరిగిన సమావేశంలోనూ ఇదే స్పష్టం చేశామని ఉద్యోగులకు ఎస్ఈసీ తెలిపారు.
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విధిగా పేర్కొన్న ఎస్ఈసీఅందరూ సహకరించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఎదుర్కొన్న ఘనత ఏపీ ఉద్యోగులదేనని.. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిలేరని నిమ్మగడ్డలో లేఖలో ప్రశంసించారు. రాజకీయాలకతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు వస్తాయని.. అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేసి.. సమిష్టి కృషితో ఎన్నికలను పూర్తి చేద్దామని కోరారు.
నిజానికి రాజ్యాంగ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించే స్థితిలో ఉద్యోగులు లేరు. ప్రభుత్వ పెద్దలే వారి వెనుక ఉండి ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అందుకే.. వారెవరూ.. ఎస్ఈసీ మాట వినే పరిస్థితి లేదు. అయినా నిమ్మగడ్డ తన బాధ్యతగా.. వారి ప్రకటనలు విని.. స్వతంత్రంగా బహిరంగ లేఖ రాశారు.