స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తొలగింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు మొత్తం పది మందికి హైకోర్టు పాస్వర్డ్లు ఇచ్చింది. అయితే ఈ రోజు మొత్తం నలభై మంది విచారణలో లాగిన్ కావడంతో చీఫ్ జస్టిస్ ఆశ్చర్యపోయారు. పాస్వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. అదే సమయంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూండగానే .. క్రాస్ టాక్ కూడా జరిగింది. దీంతో.. చీఫ్ జస్టిస్ విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసేది లేదని తేల్చి చెప్పారు.
వచ్చే సోమవారం నేరుగా కోర్టులోనే విచారణకు హాజరు కావాలని న్యాయవాదుల్ని ఆదేశించారు. విచారణకు హాజరయ్యే న్యాయవాదులందరికీ.. పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన న్యాయవాదుల్నే అనుమతిస్తామని తెలిపారు. మంగళవారం దాదాపుగా ఆరు గంటల పాటు పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. అవి ముగియకపోవడతో విచారణను ఈ రోజు కూడా కొనసాగించారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ విచారణ పాస్ వర్డ్ లీక్ కావడంతో సోమవారానికి వాయిదా పడింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమైనదని విపక్షాలు… నిబంధనల ప్రకారమే చేశామని… రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందన్నది కీలకంగా మారింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తిని గతంలోనే కోర్టు తిరస్కరించింది. కొత్త ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా… కోర్టు తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్ఈసీ వివాదంపై కోర్టు నిర్ణయం ఉత్కంఠ.. మరికొన్ని రోజులు కొనసాగనుంది.