మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు మొత్తం దాదాపుగా ఏకగ్రీవమయింది. బలవంతపు ఉపసంహరణలు.. బెదిరింపులు మాత్రమే కాదు… కొన్ని చోట్ల పేపర్లు అన్నీ సక్రమంగా ఉన్నా కొంత మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్నికల తీరుపై హైకోర్టులో పిటిషన్లు పడటంతో…. వాటిని పరిశీలించాలని హైకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. మామూలుగా అయితే అధికారులు ఇచ్చే నివేదికలపై నిమ్మగడ్డ ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన ఎక్స్ట్రీమ్ స్టెప్ వేస్తున్నారు. స్వయంగా పుంగనూరులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఆయన పుంగనూరు పర్యటన పెట్టుకున్నారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆయన అక్కడే ఉండి.. సోమవారం… పుంగనూరులో పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు.
ఆయనే అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసి.. ఏకగ్రీవాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే జరిగితే.. అక్కడి ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి.. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే ఎస్ఈసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కోర్టు ఆంక్షలు పెట్టడంతో ఆ బాధ్యత వేరే వారు తీసుకున్నారు. ఇప్పుడు నిమ్మగడ్డ మరింత దూకుడుగా ఉంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తనకు ఎదురు ఉండకూడదన్న లక్ష్యంతో ఉన్న పెద్దిరెడ్డి.. ఏకగ్రీవాల కోసం ఎవర్నీ లెక్క చేయడం లేదు. ఈ కారణంగా పరిస్థితులు దిగజారుతున్నాయి.
పుంగనూరులో ఎస్ఈసీ పర్యటనపై పోలీసులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎస్ఈసీ అక్కడకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అన్నట్లుగా సమాచారం. అయినా సరే తాను పుంగనూరులో పర్యటించి హైకోర్టుకు నివేదిక సమర్పించాలన్న ఆలోచనలో నిమ్మగడ్డ ఉన్నారు. ఎస్ఈసీ పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తిస్తే.. పుంగనూరులో పరిస్థితిపై మరింత దారుణమైన నివేదికలు రావడం మాత్రం ఖాయం. అందుకే పెద్దిరెడ్డి వర్గానికి ఇప్పుడు టెన్షన్ ప్రారంభమయింది. ఏకగ్రీవాలు ఉండవేమో అన్న టెన్షన్ ఒకటి అయితే… కేంద్ర బలగాలతో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారేమోనన్న భయం మరొకటి ఉంది. కానీ నిమ్మగడ్డను ఏమీ అనలేని పరిస్థితి పెద్దిరెడ్డికి ఏర్పడింది.