ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమవుతున్నారు. ఇరవై ఎనిమిదో తేదీన ఆయన అన్ని పార్టీల నేతలతో సమావేశం కాబోతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం ప్రకటిస్తారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన హైకోర్టులో వేసిన అదనపు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌కు సంబంధించిన విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఆ తీర్పు రాగానే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో ఎన్నికల ప్రక్రియ మధ్యలోఆగిపోయింది. దాడులు, దౌర్జన్యాలతో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సమగ్రమైన వివరాలతో.. ఓ లేఖను.. ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్రానికి పంపారు. కేంద్ర బలగాల రక్షణ కావాలని కోరారు. ఇప్పుడు నిమ్మగడ్డ.. ఏపీ సర్కార్ యంత్రాంగం… ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదు కాబట్టి.. కేంద్ర ఎన్నికల సంఘం సాయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ప్రక్రియను రద్దు చేసి.. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు.
అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించవద్దని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆ విషయం ఎస్ఈసీకి చెప్పాలని హైకోర్టు సూచించింది. దీని ప్రకారం చూస్తే.. ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఉన్నంత కాలం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సానుకూలంగా ఉండే అవకాశం లేదు. కానీ నిమ్మగడ్డ మాత్రం.. తన పదవీ కాలం పూర్తయ్యే లోపు అంటే మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయాలన్న టార్గెట్ పెట్టుకునే చాన్స్ ఉంది. ఇది మరోసారి ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఘర్షణ పూరిత వాతావరణదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ముందు ముందు గత విధానానికి భిన్నంగా.. ప్రభుత్వం ఎన్నికలు వద్దని రగడ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.