స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వంతో తలపడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆయన హైకోర్టులో వేసిన అఫిడవిట్ రాజకీయవర్గాల్లో ముఖ్యంగా అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నానను కానీ.. ప్రభుత్వ యంత్రాంగం సహకరించడమేపెద్ద సవాల్ అని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయపక్షాలతో నిర్వహించిన సమావేశం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ గతంలో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై విచారణలో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు..ఎస్ఈసీకి సూచించింది. ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని, అనేకమంది ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికే కోవిడ్ సోకిందని, పోలీస్ శాఖలోనూ అనేక మందికి కోవిడ్ వచ్చిందని ప్రభుత్వం వాదిస్తోంది. సెకండ్ వేవ్ వస్తుందని ఆరోగ్య సంస్థలు చేస్తోన్న హెచ్చరికలు, పలు దేశాల్లో సేకండ్ వేవ్ లు వస్తున్న అంశాలను అధికారులు ఎన్నికల కమిషన్ కు వివరించారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్ తన అఫిడవిట్ లో పేర్కొంది. అందరి అభిప్రాయాలతో పాటు.. ఎస్ఈసీగా తన అభిప్రాయాన్ని కూడా నిమ్మగడ్డ అఫిడవిట్లో చెప్పారు.
ఇప్పటికే స్థానిక సంస్థల పాలవర్గాల పదవీ కాలం ముగిసి ఎంతో కాలమైందని, గతంలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాల్సి వచ్చిందని, గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని అఫిడవిట్ లో రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, రాసిన లేఖలు, తదితర అంశాలను కూడా వివరించారు. అన్ని అంశాలను వివరించిన ఎన్నికల కమిషన్, హైకోర్ట్ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.
రమేష్ కుమార్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం చూస్తే ఆయన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుత యంత్రాంగం సహకరించకపోతే సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. శాంతిభద్రతల అంశంలో గతంలో జరిగిన పరిణామాలు.. అధికారులు సహకరించకపోవడం వంటివి చూస్తే.. ఆయన కేంద్ర బలగాల రక్షణలో.. పూర్తి స్థాయిలో అధికారుల మార్పుతో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. కోర్టు ప్రకటించే తీర్పుపై తదుపరి నిర్ణయాన్ని ఎస్ఈసీ తీసుకునే అవకాశం ఉంది.