ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎస్ఈసీపై నేరుగా ఎటాక్ చేస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ నేతలు హద్దులు దాటి తిట్లు లంకించుకుంటున్నారు. అయితే ఆయన కూడా ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటే .. వైసీపీ పెద్దలకు చాలా సమస్యలు వస్తాయి. ఆ విషయాన్ని కడప జిల్లా పర్యటనలో నిమ్మగడ్డ పరోక్షంగా చెప్పారు కూడా. అధికార పార్టీగా పంచాయతీ ఎన్నికల్లో తమకు అడ్వాంటేజ్ లేకుండా చేస్తున్నారన్న అసహనం నిమ్మగడ్డపై వైసీపీ నేతల్లో ఉంది. అదే సమయంలో ఆయన కడప జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కోపం .. అసహనం కట్టలు తెంచుకునే పరిస్థితి ఏర్పడింది.
ఆ వ్యాఖ్యలు ఎన్నికల గురించికాదు.. సీబీఐ కేసుల గురించి. వైఎస్ఆర్ను పొగిడిన తర్వాత నిమ్మగడ్డ సీబీఐకేసుల ప్రస్తావన తెచ్చారు. తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా కాబట్టే.. తర్వాత కాలంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు కేసుల పాలయినా తనకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాలేదన్నారు. ఆ స్వేచ్చ వైఎస్ ఇచ్చారని కూడా చెప్పుకొచ్చారు. అంతటితో వదిలి పెట్టలేదు. తాను అనేక కేసుల్లో ప్రధానమైన సాక్షినని… ఇప్పటికే కోర్టుల్లో సాక్ష్యం చెప్పానని.. ఇక ముందు కూడా చెబుతానని ప్రకటించారు.
నిమ్మగడ్డ వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఆయన సాక్షి అని చెప్పడం ద్వారా.. హెచ్చరికలు చేయాలని చూస్తున్నారో .. లేకపోతే వైసీపీ నేతల్లా తాను స్పందిస్తే.. పరిస్థితి తేడాగా మారుతుందని హెచ్చరించాలని అనుకున్నారో కానీ.. మొత్తానికి వైసీపీ నేతలకు రాంగ్ సిగ్నల్స్ వెళ్లాయి. ఏదో పరిస్థితి తేడాగా మారుతుందని అనుకున్నారు. వెంటనే… ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యంతో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నామని ప్రకటించారు. అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు ప్రివిలేజ్ మోషన్‌కు అర్థం తెలుసా అనే చర్చ చాలా మందిలో వచ్చినా వైసీపీ నేతలు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మీడియాకు చెప్పేశారు.
వైసీపీ ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయడం కంటే… నిమ్మగడ్డతోనే పోటీ పడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన కాస్త స్ట్రిక్ట్‌గా రూల్స్ అమలు పరిచి ఎన్నికలు నిర్వహిస్తారు తప్ప… గెలుపోటముల్ని నిర్దేశించరు. అంత మాత్రం దానికే వైసీపీ… నిమ్మగడ్డ వల్ల తామేదో కోల్పోతున్నామని ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది. దాన్ని ఆయన కూడా పర్సనల్‌గా తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆయన ఒక మాటలో చెప్పారు. సీబీఐ కేసుల గురించి ప్రస్తావించారు. పదవీ విరమణ తర్వాత ఆయన పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంత మంది వైసీపీ నేతలు బెదిరింపులు కూడా ప్రారంభించారు. ఇదంతా వ్యక్తిగత పోరాటానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది