ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించేలా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్.. దాని ద్వారా జారీ చేసిన జీవోలను రద్దు చేస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అంటే.. తీర్పు అమల్లో ఉన్నట్లే. కానీ ఇక్కడ ఏపీ సర్కార్ పట్టుదల వల్ల.. మొత్తం ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పుడు.. ఏం జరుగుతుందన్నదానిపై ప్రజల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మళ్లీ ఎస్ఈసీ పదవిలో చేరేందుకు తన వంతు ప్రయత్నం చేస్తారు. ఆయనను ఆపేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో.. రాజ్యాంగ సంక్లిష్టత ఏర్పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గవర్నర్‌కు చెప్పి విధుల్లో చేరే ప్రయత్నాల్లో నిమ్మగడ్డ..!
నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇప్పటికే హైకోర్టు తీర్పు తర్వాత ఓ సారి విధుల్లో చేరినట్లుగా ప్రకటించారు. ఎస్ఈసీ కార్యాలయం నుంచి ఈ మేరకు సర్క్యూలర్ కూడా వచ్చింది. కానీ ప్రభుత్వం దాన్ని గంటల వ్యవధిలోనే ఉపసంహరించుకుంది. దీంతో ఆయన కోర్టు ధిక్కరణ కింద హైకోర్టులో పిటిషన్ వేయాలనుకున్నారు. కానీ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆగిపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ వ్యతిరేక నిర్ణయం రాలేదు. దాంతో ఆయన… నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి.. ఆయనకు చెప్పి విధుల్లో చేరిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టు నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి.. తన విధులు తాను నిర్వహించుకునేలా అనుమతి కోరనున్నట్లుగా చెబుతున్నారు.
రెండు వారాలు సైలెంట్‌గా ఉండాలని ఏపీ సర్కార్ వ్యూహం..!
మరో వైపు ప్రభుత్వం మాత్రం… నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను నియమించాలని అనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా కొనసాగకూడదన్న లక్ష్యంతో ఉంది. అందుకే.. సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిందని.. రెండు వారాల గడువు ఇచ్చినందున.. అప్పటి వరకూ వేచి చూడాలని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రమేష్‌కుమార్‌ను ఎస్ఈసీగా నియమించమని.. హైకోర్టు చెప్పలేదని ఏజీ గతంలో వాదన వినిపించారు. దీన్ని బట్టి చూస్తే.. ఏపీ సర్కార్ నిమ్మగడ్డను..విధుల్లో చేరడానికి అంగీకరించే అవకాశం లేదు. నిమ్మగడ్డ చేసే ప్రయత్నాలన్నింటికీ అడ్డుకట్ట వేయడం ఖాయం.
గవర్నర్ నిర్ణయమే కీలకం..! ఏం చేయబోతున్నారు..?
అయితే ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కీలకమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. అంటే.. ఆర్డినెన్స్ అమల్లో లేదు. దాని ఆధారంగా తెచ్చిన జీవోలు రద్దయ్యాయి. ఈ ప్రకారం.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం కొనసాగుతోంది. ఇప్పుడు బాల్ గవర్నర్ కోర్టులో పడింది. నిమ్మగడ్డ గవర్నర్‌ను ఆశ్రయిస్తే.. ఆయన తీసుకునే నిర్ణయమే కీలకం కాబోతోంది. ఒక వేళ గవర్నర్ నిమ్మగడ్డను విధుల్లో చేరడానికి అనుమతిస్తే.. పరిస్థితి మారిపోతుంది. అయితే.. ప్రభుత్వ అభిప్రాయం కూడా ఆయన తీసుకుంటారు. ప్రభుత్వం అంగీకరించకపోతే.. ఆయనేం చేస్తారు అన్నది కీలకం. ఎందుకంటే .. ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్మీద గవర్నర్ సంతకం చేయడంపై విమర్సలు వస్తున్నాయి. కోర్టులు కూడా.. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఇస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు గవర్నర్ మరో సారి సెంటర్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.