ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్‌లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కాస్తంత ఊరటనిచ్చారు. వారిపై ఆయన ఇంత వరకూ అభిశంసన చేయమని డీవోపీటికి సిఫార్సు చేసినట్లుగానే ప్రచారం జరిగింది. కానీ వారితో నిర్బంధ పదవీ విరమణ చేయించాలని నిమ్మగడ్డ డీవోపిటీకి సిఫార్సు చేశారు. ఈ అంశం బయటకు రాలేదు. కేవలం అభిశంసించమని మాత్రమే చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా.. వారితో నిర్బంధంగా పదవీ విరమణ చేయించాలన్న ప్రతిపాదన కూడా పంపారని బయటకు వచ్చింది. కానీ ఇలా బయటకు వచ్చిన కారణం… ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ మరో లేఖను డీవోపీటికి రాయడమే.
సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహారాలు మొత్తం డీవోపీటీ చూస్తుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించి… ఓటరు జాబితాను ఉద్దేశపూర్వకంగా ప్రచురించకుండా.. భారత ప్రజాస్వామ్యపునాదుల్ని బలహీనం చేసే ప్రయత్నాలను ద్వివేదీ, గిరిజాశంకర్ చేశారని.. వీరిది క్షమించరాని నేరమని చెబుతూ.. నిమ్మగడ్డ డీవోపీటికి చర్యలకు సిఫార్సు చేశారు. చర్యలు కూడా ఆయనే చెప్పారు. అందులో ఒకటి అభిశంసన కాగా.. మరొకటి నిర్బంధ పదవీవిరమణ. దీంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ప్రభుత్వం చెప్పినట్లుగా చేసి వారిద్దరూ చిక్కుల్లో పడ్డారు. దీంతో ఎస్ఈసీకి అధికారం లేదని హడావుడి చేయడం ప్రారంభించారు. లేఖను వెనక్కి పంపుతున్నామని ఓ సారి.. చర్యలు తీసుకోవద్దని కోరుతూ డీవోపీటికి మరోసారి లేఖలు రాశారు. అయితే.. వారు చేసిన తప్పు అధికారికంగా నమోదవుతుంది.
ఎన్నికల నిర్వహణలో సమర్థంగా పని చేస్తే… వారిపై చేసిన చర్యల సిఫార్సులను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని కొద్ది రోజుల కిందట నిమ్మగడ్డ చెప్పారు. దానికి తగ్గట్లుగా వారు ఎన్నికల నిర్వహణలో గతంలోలా కాకుండా మామూలుగానే పనిచేస్తూండటంతో … నిర్బంధ పదవీ విరమణ సిఫార్సుల్ని వెనక్కి తీసుకుంటూ డీవోపీటికి లేఖ రాశారు. లేకపోతే.. వారి ఉద్యోగాలకు గండం పడేది. ఇంకామూడేళ్ల సర్వీసు ఉన్నద్వివేదీ.. అంత కంటే ఎక్కువే సర్వీసు ఉన్న గిరిజాశంకర్‌లు ఇప్పటికీ అభిశంసన చర్యలు ఎదుర్కోనున్నారు. ఈ వ్యవహారం మొత్తం సివిల్ సర్వీస్ అధికారుల్లో కలకలం రేపుతోంది.