ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో వేల కొద్దీ ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. కేసుల మీద కేసులు పెట్టేస్తున్నారు. ఎవరి మీద అంటే.. టీడీపీ నేతల మీదే కాదు.. ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపైనా పెట్టేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కేసులు నమోదైన విషయం కూడా చాల మందికి తెలియడం లేదు. ఈ అంశంపై ఏపీ మాజీ ఎస్ ఈసీ , సిటిజన్స్ ఫర్ డెమెుక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు. గుంటూరులో ఓటరు అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల ఎఫ్ఐఆర్లు విపరీతంగా నమోదు అవుతున్నాయని …. ఎఫ్ఐఆర్లను బెదిరింపులకు అస్త్రంగా వినియోగిస్తున్నారని నిమ్మగడ్డ ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ల నమోదుపై ఓ కమిటీ వేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భావిస్తున్నారు. రిటైర్డ్ పోలీసు అధికారులతో ఎఫ్ఐఆర్ల నమోదుపై పరిశీలన చేయించే ఆలోచన ఉందని …కమిటీ విచారణలో తేలిన వాస్తవాలను హెచ్ఆర్సీ ముందు ఉంచుతాం అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. పోలీసులు కొంతమందిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్న సమాచారం ఉందన్నారు. అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారంటే ఓటర్ల జాబితాను ప్రభావితం చేయడానికి సామాజికంగా ప్రభావితం చేయగలిగే వారిని ఐప్యాక్, వాలంటీర్లు ఇచ్చే సమాచారం తీసుకుంటున్న రామ్ ఇన్ఫో వంటి సంస్థలు గుర్తిస్తున్నాయి.
ఆ సమాచారం ఆధారంగా అధికార పార్టీ నాయకులు వాళ్లను సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా ఈసీని కూడా బెదిరించే స్థాయికి వెళ్లిపోయిన ప్రభుత్వం ఇలా పోలీసుల్ని దుర్వినియోగం చేయడం.. భారత ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఉండదేమో ?