ఆన్లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ నిర్ణయాన్ని పట్టించుకోలేదు. ఈ విషయం ఇప్పుడు… ఎస్ఈసీ రమేష్ కుమార్ ఆగ్రహానికి కారణం అయింది. ఆయన గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజాశంకర్లను మరోసారి ఆఫీసుకు రావాలని ఆదేశించారు. ఆన్లైన్ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించినప్పటికీ.. ఎందుకు అమలు చేయలేదో వచ్చి వివరణ ఇవ్వాలని ప్రత్యేకంగా నిమ్మగడ్డ లేఖ రాశారు. ఆన్లైన్ నామినేషన్లను ఆమోదించాలని.. పలు రాజకీయ పక్షాలు కోరాయని.. నిమ్మగడ్డ లేఖలో గుర్తు చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని… విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార బలం.. పోలీసులు, అధికారులు పక్షపాతంగా వ్యవహరించడం… వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగడం వల్ల విపక్ష పార్టీలు పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నాయి. దీనికి పరిష్కారంగా ఆన్ లైన్ నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఎస్ఈసీని విపక్ష పార్టీలందరూ కోరుతున్నారు. అయితే ఒక్క వైసీపీనే వ్యతిరేకిస్తోంది. ఆన్ లైన్లో అయితే ఎవరైనా ధైర్యంగా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అందుకే.. మొదటి విడత సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలను చూపించి ఆన్ లైన్ నామినేషన్ విధానం తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏకగ్రీవాల విషయంలో ఎస్ఈసీ కూడా అంత సంతృప్తికరంగా లేరు. బలవంతంగా.. దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకునే పద్దతిని సహించేది లేదని అంటున్నారు. ఇంకా మూడు విడతల నామినేషన్లను స్వీకరించాల్సి ఉంది. రెండో విడతలో కూడా… ఇలా నామినేషన్లు వేయనివ్వని పరిస్థితి ఉండకూడదంటే ఆన్లైన్ నామినేషన్లకు ప్రాధాన్యత ఇచ్చేఅవకాశం ఉంది. అయితే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది కాబట్టి…. ఆ సంస్కరణ తీసుకురావడానికి అధికారులు సంశయిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.