ఒకరు ఇద్దరూ కాదు ఏకంగా 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేసేయడానికి అస్సాం రాష్ట్రంలో తట్టా బుట్టా సర్దుకొని సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. వారిలో నలుగురిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేయగా మరో ఐదుగురుకి ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలుపమని కోరుతూ షో-కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. శాస్త్ర ప్రకారం జరగవలసిన తంతు అంతా జరిగిపోయింది కనుక ఇక ఆ 9మంది ముహూర్తం చూసుకొని కాషాయ కండువాలు కప్పుకోవడమే మిగిలుంది. అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మకు కాషాయ కండువా వేసేశారు. ఆయనే ఆ 9మంది ఎమ్మెల్యేలకి లీడరు. వాళ్ళు బొలిన్ చెటియా, ప్రదాన్ బారువా, పల్లబ్ లోచన్ దాస్, రాజెన్ బోర్ఠాకూర్ , పిజూష్ హజారికా, కృపానాథ్ మల్లా, అబు తాహెర్ బేపారి, బినంద సైకియా మరియు జయంత మల్లా బారువా.