కొన్ని కధలు బాలీవుడ్ లోనే బావుంటాయి. కధ బావుంది, సినిమా సూపర్ హిట్ కదా అని ఇక్కడ రీమేక్ చేస్తే ఫలితం ఒకొక్కసారి దారుణంగా వుటుంది. ముఖ్యంగా ప్రేమ కధలు. ‘లవ్ ఆజ్ కల్’ ని తీసుకోండి. సూపర్ హిట్ అక్కడ. ఇక్కడ పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ పేరుతో రీమేక్ చేశారు. డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. కధ బాలేదా? అంటే కాదు. కనెక్ట్ కాలేదంతే. ఒకడు తాళి కట్టిన అమ్మాయిని హీరో మళ్ళీ వరించడం ఇక్కడ జనాలకు జీర్ణించుకోలకపోయారు. ఆ సినిమా ఫ్లాఫ్ కు అదే మెయిన్ రీజన్ అని స్వయంగా దర్శకుడు జయంత్ ఒప్పుకున్నాడు.
ఇప్పుడిదంతా ఎందుకంటే నాని తాజా సినిమా ‘నిన్ను కోరి’ కోసం. కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ సినిమా కధ ఓ బాలీవుడ్ హిట్ కు ప్రేరణ గా రాసుకున్నారట. ”తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోతుంది. అయితే హీరో దేవదాస్ లా కాకుండా ఎలాగైనా ఈ వ్యక్తిని ఒప్పించి మళ్ళీ తన ప్రియురాలని వెనక్కి తీసుకువస్తాడట” ఇదీ ఈ సినిమా లైన్ అని ఇన్ సైడ్ టాక్. చాలా సెన్సిటీవ్ లైన్ ఇది. ఇలాంటి కధలు చూడ్డానికి తేలిగ్గా వుంటాయి. అయితే చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం ‘తీన్ మార్’లా ఉటుంది. మరి ఈ విషయంలో నాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో..