తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు ఇద్దరే ఇప్పుడు ఆస్థాన లాయర్లు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కీలకమైన కేసులు అయితే వీరే దిగిపోతారు. వీరిద్దరికి ఇప్పుడు వేరే కేసులు చూసేంత తీరిక ఉండటం లేదు. ఎవరు అధికారంలో ఉన్నా.. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా లాయర్లు మాత్రం వీళ్లే. వీరి ఆఫీసులు కళకళలాడిపోతూంటాయి. కానీ ఆయా పార్టీలకు.. వారిని నియమించుకుంటున్న వారికి మాత్రం.. కోట్లలో ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి.,
బీఆర్ఎస్, వైసీపీ ఆస్థాన లాయర్ నిరంజన్ రెడ్డి
తెలంగాణకు చెందిన లాయర్ నిరంజన్ రెడ్డి జగన్ అక్రమాస్తుల కేసుల్లో లాయర్. ఆయన సుప్రీంకోర్టు లాయర్ కూడా. కానీ జగన్ కు సంబంధించిన కేసులు.. జిల్లా కోర్టులో విచారణకు వచ్చినా ఆయన హాజరవుతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన హవా అంతా ఇంతా కాదు. ఆయనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చేవారో కానీ.. ఆయన సేవలకు మెచ్చి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ రెడ్డి అలా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కు కూడా కీలక లాయర్. బీఆర్ఎస్ నేతలకు చెందిన కీలక కేసులు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో వచ్చినా సరే ఆయనే విచారణకు హాజరవుతారు.
టీడీపీ ఫేవరేట్ సిద్ధార్థ లూధ్రా – ఇప్పుడు కాంగ్రెస్‌కూ సేవలు
సిద్దార్థ లూధ్రా తెలుగువారి బాగా పరిచయం. చంద్రబాబునాయుడును అరెస్టు చేసినప్పుడు ఆయనే వచ్చి వాదించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వచ్చి పిటిషన్లను ఆయనే చూసుకుంటున్నారు. గతంలోలా వ్యక్తిగత రాజకీయకక్షల కేసులు ఇప్పుడు ఢిల్లీ వరకూ పోవడం లేదు. కేసులు నమోదు కాకుండానే ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు పెడుతున్నారు నేతలు. అలాంటి వారి పిటిషన్ల విషయంలో ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన కొన్ని కేసులనూ ఆయన సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు.
లాయర్ల పంట పండిస్తున్న పార్టీలు
రాజకీయ పార్టీలు ప్రతీ దానికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి లాయర్లకు పని పెడుతున్నాయి. కొన్ని కొన్ని నిమిషానికి లక్షల్లో తీసుకునే లాయర్లను నియమించుకుంటున్నాయి. జగన్ రెడ్డి అమరావతిపై కుట్రలు చేసి వాటి తరపున వాదించడానికి ప్రజాధనం ఒకే సారి ఐదు కోట్లు ఓ లాయర్ కు ఇచ్చారు. ఐదేళ్లలో అలా ఎన్ని కోట్లు ఇచ్చి ఉంటారో ఊహించడం కష్టమే. ఇప్పుడు ప్రభుత్వం అలాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకోవడం లేదు కానీ..సిద్ధార్థ లూధ్రాకు కూడా బాగానే చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా ఇప్పుడు అధికార పార్టీలకు సిద్ధార్థ లూధ్రా, ప్రతిపక్ష పార్టీలకు నిరంజనా రెడ్డి ఆస్థాన లాయర్లుగా మారారు.