తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా “తానా” అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. ఆయన ప్యానెల్ తరపున పోటీ చేసిన వారు విజయం సాధించారు. నరేన్ కొడాలి ప్యానల్ పరాజయం పాలైనా చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చారు. పోలైన ఓట్లలో శృంగవరపు నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. తానా ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అనేక వివాదాల మధ్య జరిగాయి. మొదట్లో ఎన్నికల ప్రక్రియలో దొంగ ఓట్లను చొప్పించినట్లుగా గుర్తించారు. చివరి దశలో ఎన్నికలు వాయిదా వేశారు. తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు.
ఈ కారణంగా కొంత ఆలస్యం అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు పెద్ద ఎత్తున ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉంటారు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి… ఉత్కంఠభరితమైన పోటీ ఉంటుంది కానీ.. ఈ సారి .. మాత్రం మరింత ప్రత్యేకంగా జరిగాయి. అనేక అరాచకాలు చోటు చేసుకున్నాయి. సీనియర్లు అయిన ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని నియమించి.. ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కీలక స్థానంలో పోటీ చేస్తున్న వారే.. దొంగ ఓట్లను చేర్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తానా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో.. అసోసియేషన్ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా రెండు ప్యానళ్లు ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. చివరికి ఓ పనైపోయిందని అనిపించారు. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల్లో సుదీర్ఘంగా ఉన్నది తానానే. తెలుగురాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే వారికి ఎన్నో విధాలుగా ఉండగా ఉంటుంది. అక్కడ స్థిరపడిన వారికి కూడా వివిధ సమస్యల్లో సహాయకారిగా ఉంటుంది.