ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి, వాటిని నియంత్రించడానికి అత్యంత పటిష్టంగా రూపొందిన చట్టాల్లో నిర్భయ చట్టం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు, రావెల సుశీలపై కూడా అదేకేసు నమోదు అయింది. ఒత్తిళ్లకు చివరికి ముందస్తుగా బెయిలు పొందడానికి చేసిన అనేక ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో చివరికి రావెల సుశీల్ శనివారం అర్ధరాత్రి తర్వాత బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. ఆయనను, ఆయన డ్రైవర్ అప్పారావును కూడా పోలీసులు అరెస్టు చేసి నిర్భయ కేసు పెట్టారు.
ఈ కేసు ఊబిలోంచి రావెల సుశీల్ బయటపడడం అంత సులువు కాదని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఆధారాలు అన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం పరంగా ఎలాంటి ఒత్తిడి చేయడానికి కూడా ఆస్కారం లేని విధంగా కేసు తయారయింది. కేసుకు సంబంధించి తెలుస్తున్న వివరాల్ని బట్టి..
తాగిన మత్తులో ఉన్న సుశీల్, అతని డ్రైవరు అప్పారావు కలిసి వివాహితను సుమారు కిలోమీటరు దూరం వెంబడించారు. మధ్యలో ఆమెను చేయి పట్టుకుని కారులోకి లాగడానికి కూడా సుశీల్ ప్రయత్నించాడు. ఆ మహిళ కాలనీ వచ్చేయడంతో ఆమె కేకలు పెట్టడం వలన భర్త సహా, జనం పోగయ్యారు. సుశీల్‌ను, డ్రైవరును చితక్కొట్టారు. అప్పుడే అక్కడకు వచ్చిన ఒక కానిస్టేబుల్ వారిని పోలీసు స్టేషన్లో అప్పజెపుతానంటూ జనంనుంచి విడిపించి.. తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సందుగా సుశీల్ తప్పించుకుని పారిపోయాడు. ఇదీ సంఘటనల క్రమంగా ఉంది.
కుక్కపిల్లను తప్పించబోయి కారు పక్కకు తీస్తే ఆ మహిళ అనవసరంగా భయపడినదంటూ.. సుశీల్ ఫేస్బుక్లో పోస్టు చేసిన ప్రకారం.. ఈ వ్యవహారం అంత చిల్లరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. సుమారు కిలోమీటరు దూరం ఫాలో అయిన సంగతి స్పష్టంగా సీసీ కెమెరాల పుటేజీకి చిక్కింది. కాలనీ వాళ్లంతా వచ్చి వాళ్లను చితక్కొట్టారు గనుక.. వారందరూ కూడా సాక్షులుగానే ఉంటారు. అందుకే సుశీల్‌కు గడ్డురోజులు తప్పవని అందరూ భావిస్తున్నారు. కారులో మరెవరైనా ఉన్నట్లు బనాయించడానికి కూడా కుదరకపోవచ్చు. ఎందుకంటే జనానికి చిక్కి వారిచేత దెబ్బలు తిన్న తరువాత.. వారికి తెలియకుండా మనుషుల్ని మార్చడం కుదరదు. అయితే ఇలాంటి నేరాలు ఎవరు చేసినా సరే.. శిక్ష అనుభవించి తీరాల్సిందేనని.. తన కొడుకు గనుక తాను జోక్యం చేసుకునేది ఉండదని మంత్రి రావెల కిశోర్‌బాబు సెలవిచ్చారు. అంతటి నిజాయితీ స్టేట్మెంట్ ఇచ్చినందుకైనా.. ఆయన తన కొడుకును కొన్నాళ్లు కటకటాల్లో చూసుకోవాల్సిన అగత్యం తప్పేలా లేదు.