న్యూఢిల్లీసహా దేశమంతటా మహిళలు గడగడా వణికిపోయిన నిర్భయ అత్యాచార ఉదంతంలో ఓ మైనర్ ఉన్నాడు గుర్తుందా. అతడి పేరు రాజు. మూడేళ్ళ జైలు శిక్ష అనుభవించి, విడుదలైన ఇతడి ప్రస్తావన, మిగిలిన నిందితులకు ఉరి శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆసక్తికరమే కదా. బాలల హక్కులు, సంరక్షణ చూస్తున్న హెచ్ఎక్యూ అనే స్వచ్ఛంద సంస్థ ఇతని సంరక్షణ బాధ్యతలను చేపట్టింది. అతనేం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమూ ఇచ్చింది. మిగిలిన వారికెలా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు ఒళ్ళు గగుర్పొడిచే సమాధానమే అది. దక్షిణాదిలో ఉన్న ఒక రాష్ట్రంలో ఉన్నాడితడు. బోర్డింగ్ స్కూలులో వంటలో ప్రావీణ్యం కనబరచడంతో అతడికి అందులో శిక్షణ ఇచ్చారట. ఇప్పుడతణ్ణి జాతీయ రహదారి వెంబడి ఉన్న ఒక ధాబాలో వంటగానిగా చేర్చింది ఆ సంస్థ. ఇతడు నిర్భయ కేసులో శిక్ష అనుభవించి విడుదలయ్యాడని ధాబా యజమానికి కూడా తెలియదు. అతడెక్కడున్నదీ తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకూ, ఇంటెలిజెన్స్ అధికారులకూ మాత్రమే తెలుసు. అతడి వయసు ఇప్పుడు 23 ఏళ్ళు. బోర్డింగ్ స్కూలులో మంచి ప్రవర్తన కనబరిచాడనీ, భక్తి పెరిగిపోయిందనీ సంస్థ ప్రతినిధి చెప్పారు. రోజూ ఐదుసార్లు నమాజు చేస్తున్నాడనీ తెలిపారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడని చెప్పారు. పుట్టిన ఊరికి దూరంగా వచ్చేసిన అతను తన రూపును పూర్తిగా మార్చుకున్నాడు. గడ్డ పెంచుకున్నాడని సంస్థ చెబుతోంది.
మొత్తం ఆరుగురు నిందితుల్లో రామ్ సింగ్ బస్ డ్రైవర్. జైలులోనే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ఇక్కడ కీలకమైన అంశమేమిటంటే.. నిర్భయపై అత్యంత పాశవికంగా వ్యవహరించిందీ.. హింసించిందీ రాజు. తుప్పు పట్టిన ఇనుక కడ్డీని ఆమె మర్మాంగంలోకి జొనిపి, పేగులు బయటకు లాగాడంటే ఇతడెంతటి క్రూరాత్ముడో అర్థం చేసుకోవచ్చు. నేరంలో ఇతని పాత్రను గమనించి కూడా చట్టంలోని లొసుగు కారణంగా విడిచిపెట్టాల్సి వచ్చింది. నేరం చేసే సమయానికి ఇతడు బాలుడు. అతడి నేర ప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని హెచ్ఎక్యూ సంస్థ ఇతడి వివరాలను నిఘా విభాగానికి అందించింది. ఆ అధికారులు ఇతడిని నిరంతరం నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా అతడిలోని నేర ప్రవృత్తి బయటపడితే..తక్షణం చర్య తీసుకునేందుకు కాచుకుని ఉన్నారు. బోర్డింగ్ స్కూలులో ఉన్నప్పుడు ఇతడి వంటకాలను తినేందుకు సహచరులు ఎక్కువ ఆసక్తిని కనబరిచేవారట. ఈ ఒక్క లక్షణం అతణ్ణి వంటవాణ్ణి చేసింది. 2015 డిసెంబర్ 20న విడుదలైన తరవాత, స్వగ్రామానికి వెళ్ళాడు. గ్రామస్థులు అతడి మొహంమీద ఉమ్మేశారు. ఆ సమయంలో హెచ్ఎక్యూ అతణ్ణి చేరదీసింది. అతడి అభిరుచిని గమనించి, శిక్షణ ఇప్పించింది. పాత జీవితానికీ, అలవాట్లకూ దూరంగా ఉంటున్నాడని గమనించి, అతణ్ణి దక్షిణాది రాష్ట్రాల్లోని ఓ జాతీయ రహదారిపై ఉన్న ధాబాలో వంటవాడిగా చేర్పించింది. పాము ఎక్కడున్నా పామే. నేరస్థుడిలోని ప్రవృత్తి ఏ సమయంలోనైనా పడగలు విప్పే అవకాశముంటుంది. ఇంతటి క్రూరమైన నేరస్థుణ్ణి దక్షిణాది పంపిన సంస్థే అతడిలోని క్రూరమైన ప్రవృత్తి పడగ విప్పకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలి. లేకుంటే మరో ఘటన జరగదన్న భరోసా లేదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి