డిల్లీలో నిర్భయ సామూహిక అత్యాచారం జరిగి నేటికి మూడేళ్ళు పూర్తయ్యాయి. నిర్భయకి నివాళులు అర్పిస్తూ ప్రతీ ఏడాది డిశంబర్ 16వ తేదీన డిల్లీలో మహిళా సంఘాలు నిర్భయ చేతన్ దివస్ నిర్వహిస్తున్నాయి. ఈరోజు కూడా డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్భయ తల్లి తండ్రులు అశాదేవి, బదరీనాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి మాట్లాడుతూ “నా కూతురు పేరు జ్యోతీ సింగ్. ఆమె పేరు చెప్పడానికి మేము సిగ్గు పడవలసిన అవసరం లేదు. ఆమెపై అత్యాచారం చేసినవారే సిగ్గుపడాలి. ఈ సంఘటన జరిగి నేటికి మూడేళ్ళు పూర్తయిపోయింది. దోషులెవరో చట్ట ప్రకారం కనుగొన్నారు. వారికి కోర్టు శిక్షలు కూడా ఖరారు చేసింది. అయినా ఇంతవరకు వారికి శిక్షలు అమలుచేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాము. వారిలో ఒకడు మైనర్ అనే కారణంగా మరో రెండు మూడు రోజుల్లో దర్జాగా బయటకు రాబోతున్నాడు. అటువంటి హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిని ఏమీ చేయలేని నిస్సహాయత మనది. బాలనేరస్తుడిపుడు మేజర్ అయ్యాడు. అతని వలన సమాజానికి ఇంకా ప్రమాదం ఉంటుంది. కనుక అతనిలో మార్పు కలిగే వరకు నిర్బంధించి ఉంచాలని కోరుకొంటున్నాము. ఇటువంటి నేరస్తులను కటినంగా శిక్షించకపోయినట్లయితే అటువంటి నేరాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కనుక ఇప్పటికయినా దోషులకు శిక్ష వేయాలని మేము కోరుతున్నాము,” అని అన్నారు.