ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా .. అత్యంత కిరాతకమైన నేరం చేసిన నిర్భయ దోషులు నలుగురికి తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. నిబంధనల ప్రకారం.. ఉరి తీత ప్రక్రియను పూర్తి చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వారు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. తాము నేరం చేయలేదన్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష వరకూ వెళ్లారు. కానీ నిర్భయ తరహాలో దేశంలో పెరిగిపోతున్న అనేక ఘటనలు.. వారిపై ప్రభావం చూపించాయి. తెలంగాణలో దిశ తరహా ఘటన జరగడంతో.. నిర్భయ దోషులతో పోల్చి.. వారికి శిక్ష ఆలస్యం అవుతుందనే ఆందోళన వెలిబుచ్చారు. ఆ తర్వాత ఆ దోషులు ఎన్ కౌంటర్ అయ్యారు.. కానీ నిర్భయ నిందితులకు మాత్రం…ఏడేళ్లకు శిక్ష పడింది.
ఏడేళ్ల క్రితం యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ ఘటనలో ఇప్పటికి శిక్ష విధించారు. 2012 డిసెంబర్ 16 అర్థరాత్రి, ఢిల్లీ నడివీధుల్లో కదులుతున్న బస్సులో…అత్యంత కిరాతక సామూహిక అత్యాచార ఘటన.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బాధితయువతి చవిచూసిన క్షోభను భారతీయులెవ్వరూ మర్చిపోలేదు. ఈ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలుతోనే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని అంతా ఆశిస్తూ వచ్చారు. కానీ అడుగడుగునా ఆటంకాలు, డెత్ వారెంట్లు జారీ అయినా తప్పించుకునేందుకు దోషులు చేసిన యత్నాలతో న్యాయం ఇంకెంత దూరం అన్న ప్రశ్న కూడా వచ్చింది.
కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం యావత్ దేశాన్ని కుదిపేసింది. అత్యాచారం చేసిన మృగాళ్లు…ఆమెను బస్సులోంచి తోసేయడంతో తీవ్ర గాయాలపాలైంది. దేశం మొత్తం ఉద్యమం రావడంతో ప్రభుత్వం ఆమెను కాపాడేందుకు సింగపూర్ తరలించింది. కొన్ని రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చావుబతుకుల్లో పోరాడింది. చివరికి చనిపోయింది. ఈ హృదయ విదారక ఘటన ప్రజా ఉద్యమానికి దారితీసింది. యావత్ దేశం అంతటా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు జరగడంతో… దిగొచ్చిన నాటి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నిర్భయ హత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఒకడు బాల నేరస్తుడు. మరో నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి ఈ నలుగురికి ఉరిశిక్ష విధించింది