జమిలి ఎన్నికలంటూ జరిపితే.. అందులో జమ్మూకశ్మీర్ ఉంటుందన్న అంచనాలను కేంద్రం పటాపంచలు చేస్తోంది. పార్టీలను చీల్చి.. త్వరలోనే అక్కడ పూర్తి స్థాయి బీజేపీ ప్రభుత్వాన్ని కొలువు దీర్చే ప్రయత్నం చేస్తోంది. అది.. కూడా హిందూ ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని పీఠంపై కూర్చొబెట్టాలని నిర్ణయించుకుంది. జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత నిర్మల్ సింగ్ ప్రధానిని కలిశారు. నిర్మల్ సింగ్‌తో సమావేశానికి ముందు బీజేపీ జమ్మూకశ్మీర్ ఇన్చార్జి రామ్‌మాధవ్ మోడీతో సమవేశమయ్యారు. ఈ సమావేశంలోనే.. ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆగస్టులో అమర్నాథ్ యాత్ర ముగియనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. రామ్‌మాధవ్.. పూర్తిగా జమ్మూకశ్మీర్పైనే దృష్టి కేంద్రీకరించారు. ఇద్దరు ఎమ్మెల్యేలున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సజ్దద్ లోన్‌తో చర్చలు జరిపారు. మరో వైపు పీడీపీని చీల్చేందుకు.. అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. ఓ ఎమ్మెల్యే ఇప్పటికే.. మెహబూబా ముఫ్తీ నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తిరుగుబాటు చేశారుకూడా. మొత్తం పీడీపీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. 12 మందితో బీజేపీ చర్చలు పూర్తి చేసిందని చెబుతున్నారు.
87 మంది సభ్యుల జమ్మూకశ్మర్‌లో కొత్తగా అధికారం చేపట్టాలనుకునే ఏ కూటమికైనా 44 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు మరో 19 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. లోన్‌కు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు బీజేపీకే దక్కనున్నందున మరో 17 మంది ఎమ్మెల్యేల మద్దతు అనివార్యం. పీడీపీ తిరుగుబాటు వర్గం నుంచే మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ఒక్కటే ప్రస్తుతం బీజేపీ ముందున్న మార్గం. గత అనుభవాలతో బీజేపీకి ఇది సులువే. కానీ ఆ పార్టీ ఇమేజ్ మరోసారి.. నేలబారుగా మారుతుంది. హిందువును కశ్మీర్‌కు ముఖ్యమంత్రిని చేశామని చెప్పుకుని.. మైలేజ్ కోసం ప్రయత్నించే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయబోతోంది.