హైదరాబాద్: పుణ్యానికి పోతే పాపం ఎదురయింది అన్నది ఒక నానుడి. కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇవాళ ఇదే పరిస్థితి ఎదురయింది. ఆంధ్రాలో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మీడియాద్వారా తెలుసుకున్న మంత్రి, రెండు రోజులలో ఆ ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పటమేకాక అన్నట్లుగానే ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే విహారయాత్రకు ఇటలీకి వెళ్ళిన పొగాకు బోర్డ్ ఛైర్మన్ గోపాల్‌ను సస్పెండ్ చేశారుకూడా.
అయితే రైతు ఆత్యహత్యలపై ఇంతగా స్పందించిన మంత్రికి దురదృష్టవశాత్తూ ఇవాళ ప్రకాశంజిల్లాలో చేదు అనుభవం ఎదురయింది. కొందరు పొగాకు రైతులు నిర్మల కాన్వాయ్‌ను అడ్డగించారు. రహదారికి అడ్డంగా బైఠాయించి మిగిలిన పొగాకు కొనుగోలుకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె కారుదిగి రైతులతో మాట్లాడి పొగాకు కొనుగోలుకు చర్యలు చేపడతామని నచ్చచెప్పారు. ఆ తర్వాత రైతులు అడ్డు తప్పుకోవటంతో ఆమె పర్యటన కొనసాగింది. రాష్ట్రమంత్రులు శిద్ధా రాఘవరావు, పత్తిపాటి పుల్లారావుకూడా నిర్మలవెంట ఉన్నారు. నిర్మల కందుకూరులోని పొగాకు కొనుగోలు కేంద్రానికి వెళ్ళి రైతు సమస్యలపై వారితో మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని, మిగిలిన పొగాకును కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక రైతు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. మంత్రిని అడ్డుకున్ రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారుగా భావిస్తున్నారు.