ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చినప్పటి నుండి … ఆదాయపు పన్ను మినహాయింపులు పెంచక.. అటు జీఎస్టీలు బాదేస్తూ.. మరో వైపు పెట్రో పన్నులను వడ్డిస్తూ.. మధ్యతరగతికి చూపించిన నరకానికి నిర్మలా సీతారామన్ కాస్త రిలీప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆాదాయపు పన్ను పరిమితిని ఊహించినంతగా కాకపోయినా కాస్త పెంచి రిలీఫ్ ఇచ్చారు. గత ఏడేళ్లుగా ఎదురుచూస్తూ .. నిరాశ పడుతున్న వారు ఈ సారి పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అంచనాలు లేకపోవడం వల్ల ఇచ్చిన మినహాయింపులు గొప్పగా అనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ. రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికే. ఏడు లక్షల లోపు ఆదాయం ఉంటే.. ఇతర మినహాయింపులేమీ పెట్టుకోకుండా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇక పాత శ్లాబ్ విధానంలోనూ కాస్తంత వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకూ రూ. రెండున్నర లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.3 లక్షల వరకు పెంచారు. శ్లాబుల్ని ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. రూ.3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10శాతం,9 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 లక్షల ఆదాయం దాటిన వారు 30శాతం ట్యాక్స్ కట్టాలి. ద్రవ్యోల్బణానికి తగ్గట్లుగా చూసుకుంటే.. ఈ మినహాయింపులు పెద్ద ఊరట కాదు కానీ.. ఎంతో కొంత కనికరించారని సంతోషపడటమే.
ఎన్నికల ఏడాది కావడంతో .. వీలైనంత వరకూ పన్నుల భారం మోపకుండా ఉండేలా చూసుకున్నారు. ఫోన్లు, టీవీల పై పన్నులు తగ్గించారు. బంగారం పై పెంచారు. ఎన్నికలు ఉన్న కర్ణాటకు కాస్త ఎక్కువ నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగానికి, మౌలిక వసతులకు పెద్ద పీట వేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా బడ్జెట్ ను ఎన్నికల ఏడాది బడ్జెట్ గానే ప్రవేశ పెట్టారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందుకే వచ్చే ఏడాది కేవలం ఓటాన్ అకౌంట్ మాత్రమే ప్రవేశ పెట్టగలరు. అందుకే వీలైనంతగా ఇంత కాలం పెట్టిన వేతలకు వెన్న పూసే ప్రయత్నం చేశారు.