భారత్లో ఆర్థిక మాంద్యానికి కారణం.. ఓలా, ఉబెర్ సంస్థలు. నమ్మినా… నమ్మకపోయినా… ఇది నిజం. ఎవరో చెబితే.. మనం అనుమానపడాలి కానీ.. స్వయంగా… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు కాబట్టి… నమ్మి తీరాల్సిందే. మరో ఆప్షన్ లేదు. ఇంతకీ.. ఓలా, ఉబెల్ సంస్థలు ఎందుకు ఆర్థిక మాంద్యానికి కారణమయ్యాయనే.. డౌట్ అందరికీ వస్తుంది. దానికి ఆమె కూడా.. కొత్త కారణం చెప్పారు. నేటి యువతరం అంతా… సొంతంగా కార్లు కొనుక్కోవాలనే ఆలోచన మానేసుకుని… ఓలా, ఉబెర్లలో ప్రయాణిస్తున్న ఫలితంగా.. ఆటోమోబైల్ రంగంలో… అమ్మకాలు పడిపోయి.. మాంద్యం ప్రారంభమయిందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఎంత బాగుందో.. అనుకునేంత గొప్ప కారణాన్ని భారతదేశ ఆర్థిక మంత్రి ఏ మాత్రం తడుముకోకుండా మీడియాకు వెల్లడించారు.
భారత్లో తొలి సారి ఆర్థిక మాంద్యం చాయలను… బయట పెట్టిన పరిశ్రమ ఆటోమోబైల్ రంగమే. 30 శాతం వరకూ కార్ల అమ్మకాలు పడిపోవడంతో.. కార్ల తయారీ కంపెనీలన్నీ… ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. ప్లాంట్లకు కొన్ని రోజులు సెలవులు కూడా ప్రకటించాయి. ప్రభుత్వం జీఎస్టీ విపరీతంగా పెంచడం.. ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది… ఆటోమోబైల్ పరిశ్రమ కేంద్రాన్ని ఏమీ అనలేకపోతోంది. ఉత్పత్తిని కుదిస్తూ.. ఉద్యోగాల్లో కోత విధిస్తూ.. తాము బయటపడటానికి మార్గాలను ఆన్వేషించుకుంటోంది. జీఎస్టీ సమస్యను అడపాదడపా కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా… ఆ వైపు నుంచి ఫలితం కనిపించడం లేదు. అయితే కారణాలన్నీ తెలిసి కూడా… కేంద్రం అసలు సమస్యను పరిష్కరించకపోవడంతో… ఆటోమోబైల్ అమ్మకాలు రోజు రోజుకీ పడిపోతున్నాయి. ఈ కారణాన్ని గుర్తించడానికి ఇష్టపడని ఆర్థిక మంత్రి… ఓలా, ఉబెర్లపై సులువుగా నింద వేసేశారు.
యువత ఓలా, ఉబెర్ వాడుకుంటున్నందున కార్ల అమ్మకాలు పడిపోయాయి సరే.. మరి లారీలు, ట్రక్కుల అమ్మకాలు ఎందుకు పడిపోయాయి..? భారీ వాణిజ్య వాహనాలు అమ్మకాలు ఎందుకు పడిపోయాయి..? ఇవన్నీ… ఓలా, ఉబెర్లో దొరకవు కదా..!? అనే సందేహం… ఇతరులకు వచ్చింది. లారీలు, ట్రక్కుల అమ్మకాలు 70 శాతం మేర పడిపోయాయని.. అశోక్ లేలాండ్ కంపెనీ గగ్గోలు పెడుతోంది. ఇది మాత్రం.. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా.. ఏకంగా 30 శాతం మేర పడిపోయాయని.. హీరో సంస్థ ప్రకటించిది. దీనికి కూడా ఓలా, ఉబెర్ కారణమా..?. ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి కేంద్రం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా.. పొసగని కారణాలను వెల్లడిస్తూ.. టైంపాస్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.