ఓ సినిమాలో గన్ పట్టుకున్న బ్రహ్మానందం వణికిపోతూ ఉంటాడు. అదేంటన్నా అలా భయంతో వణికిపోతున్నావు అని పక్కన అనుచరుడు అడిగితే.. గన్ వాడి చేతికి ఇచ్చి..కాస్త రిలీఫ్ ఫీలై.. వణుకుతోంది నేను కాదురా గన్.. అంటా… మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర కూడా ఇలాంటి లాజిక్కులకు కొదవలేదు. గతంలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి అని సాక్షాత్తూ పార్లమెంట్లో ఎవరో అంటే.. వాటితో నాకేం సంబంధం నేనేం ఉల్లిపాయలు తినని సమాధానమిచ్చిన ఘటికురాలు. ఇప్పుడు రూపాయి పతనం విషయంలోనూ అలాంటిదే చెప్పారు. ఆర్థిక శాస్త్రం చదివిన వారికి కొత్త పాఠాలు బోధించారు.
ఇటీవలి కాలలో రూపాయి పాతాళానికి పడిపోతోంది. ఒకప్పుడు నలభై దగ్గర ఉంటేనే గగ్గోలు పెట్టిన నేటి పాలకులు.. ఇప్పుడు అది ఎనభై దాటిపోయింది. ఇంకా ఆగడం లేదు. ఎక్కడికో పోతోంది. దీంతో అసలు కేంద్రం ఏం చేస్తోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్కు కూడా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు .. అందరి వైపు విచిత్రంగా చూశారు. ఈ మాత్రం తెలియదా అన్నట్లుగా .. సమాధానం ఇచ్చారు. రూపాయి క్షీణించడం లేదు… డాలర్ బలపడుతోంది అంతే.. అని భరోసా ఇచ్చేశారు. ఆమె సమాధానానికి .. అక్కడ ఉన్న వారంతా మరో మాట మాట్లాడలేకపోయారు. ఇంకా అడిగితే ఇలాంటి లాజిక్కులేమైనా చెప్పి మాట రాకుండా చేస్తారన్న నమ్మకంతో.
ఆర్థిక వ్యవస్థ పట్ల ఏ మాత్రం అవగాహన లేని వాళ్లు దేశాన్ని నడుపుతున్నారని.. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని కొంత మంది ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక విధానాలు పూర్తిగా రాజకీయ కోణంలోనే అమలు చేస్తున్నారని ఫలితంగా పరిస్థితి దిగజారుతోందని అంటున్నారు. అయితే దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నామన్న .. గొప్ప ప్రకటనలు… ప్రచారంలో బండి నడిపించేస్తున్నారు పాలకులు. ఇప్పుడు డాలర్ విషయంలోనూ అంతే.