ఏపీ బీజేపీ నేతలు ఇటీవల కాస్త యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేశారు. అమరావతికి మద్దతు ప్రకటించడం దగ్గర్నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడం వంటి పనులు చేస్తూ వస్తున్నారు. వారు వైసీపీ నీడ నుంచి బయటకు వస్తున్నారన్న అభిప్రాయం జనంలో ప్రారంభమయింది. అయితే అనూహ్యంగా నిర్మలా సీతారామన్ అనంతపురం రావడం… ఆ సభలో జగన్ను మోడీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారని వ్యాఖ్యానించడంతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల మాటలను పట్టించుకునే వారు కూడా లేకుండా పోయింది.
మూడు రోజుల కిందట విజయవాడలో ఏపీ బీజేపీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆరెస్సెస్ నిర్దేశకుడు శివప్రకాష్ జీ కూడా వచ్చారు. ఎం చేయాలో.. ఎలా చేయాలో చెప్పి పోయారు. ఈ సమీక్షకు కవరేజీ ఇవ్వాలని బీజేపీ పీఆర్ అదే పనిగా విజ్ఞప్తి చేసినా ఏ ఒక్క మీడియా పట్టించుకోలేదు. అసలు ఆ కార్యక్రమం జరిగిందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకుంది. నేరుగా కడపకు వెళ్లి పెండింగ్ ప్రాజెక్టుల అంశంపై పోరాడాతమని సోము వీర్రాజుప్రకటించారు. ఆయన ప్రకటనా ప్రజల్లోకి వెళ్లేలా ప్రాధాన్యత దక్కలేదు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జగన్కు పూర్తి స్థాయిలో సహకరిస్తోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. దాని వల్ల ఏపీలో బీజేపీ పరిస్థితి గడ్డుగా మారుతోంది. రాను రాను కుంచించుకుపోతోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఎవరికీ నమ్మకం లేదు. వైసీపీ నేతలకే నమ్మకం ఉందన్న విమర్శలు ఉన్ాయి. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ .. ఏపీ బీజేపీ నేతలపై ఓ బండ వేసి వెళ్లారన్న అసంతృప్తి ఎక్కువ మందిలో కనిపిస్తోంది .