చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీని భారీగా తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లుఎప్పటిలాగే ఉంటాయని ఆమె ప్రకటించారు. బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని గురువారమే వాయిదా వేసింది కేంద్రం. ఆర్థిక సంవత్సరం చివరి రోజు… హడావుడిగా నిర్ణయం తీసుకుని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనో.. అందరూ ఒకేసారి ఉపసంహరించుకుంటే మొత్తానికే సంక్షోభం వస్తుందో కానీ గురువారమే ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటన చేశారు.
ఒకప్పుడు చిన్న మొత్తాల పొదుపు అనేది కేంద్ర ప్రభుత్వాలు ఉద్యమంలా చేశాయి. ప్రజల్ని పెద్ద ఎత్తున పొదుపు చేసేలా ప్రోత్సహించారు. ఆకర్షణీయమైన వడ్డీ ఆఫర్ చేసేవారు. ఒకప్పుడు… ప్రజలను ఈ పథకాలు విశేషంగా ఆకర్షించాయి. తమ ఆదాయంలో ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వ చిన్నమొత్తాల పొదుపు పథకంలో సేవింగ్స్ చేసుకునేవారు. అలా ప్రభుత్వం వద్ద వివిధ పథకాల కింద కొన్ని లక్షల కోట్లు పోగుపడ్డాయి. వాటిని ప్రభుత్వం వేర్వేరు అవసరాలకు ఉపయోగించుకుంది. మెచ్యూరిటీ తీరిన వారికి చెల్లింపులు చేస్తోంది. అయితే వడ్డీ భారం అనుకుందో.. లేకపోతే.. ఆ పొదుపుల వల్ల ప్రభుత్వానికి భారం అవుతుందనుకుందో కానీ.. ఇప్పుడు.. తగ్గించాలనుకున్నట్లుగా ఉంది. అందుకే వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఇలాంటి కీలక నిర్ణయాన్ని ఎంతో మేధోమథనం తర్వాతనే తీసుకుంటారు. అలా తీసుకున్న నిర్ణయాన్ని ఒక్క రోజులోనే కేంద్రం రివర్స్ చేసుకుందంటే.. అంతకు మించి ఏదో జరిగి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రజలందరూ.. తమ తమ చిన్న మొత్తాలను వెనక్కి తీసుకుంటే… ఒక్క సారిగా లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అలాంటి పరిస్థితి వస్తే సంక్షోభం ఏర్పడుతుందన్న ఆందోళనతో వెనక్కితగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది.