కేంద్ర మంత్రి వర్గ విస్తరణ బిజెపి రాజకీయ ప్రయోజనాల కోణంలో ఆరెస్సెస్ బాసుల ఆదేశాల పరిధిలో జరిగిందని ఇప్పుడు స్పష్టమై పోయింది. క్రమశిక్షణ గురించి ఎంత చెప్పుకున్నా దిగిపోయే మంత్రులు ఏదో ఒక రూపంలో తమ అక్కసు వెళ్లగక్కకుండా ఆగలేదు. ఆఖరుకు మెత్తన్నగా పేరొందిన దత్తన్న(బండారదత్తాత్రేయ) కూడా అసంతృప్తి దాచుకున్నది లేదు. తొలగించిన వారు పోగా కొత్తగా వచ్చిన వారి సంగతి చూస్తే తొమ్మిది మందిలోనూ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకూ(రాజస్థాన్,మధ్యప్రదేశ్, కర్ణాటక) పార్టీ అంతర్గత సర్దుబాట్లకు(యుపిలో యోగి ఆదిత్యనాథ్ నియామకం సమయంలో రాజీ మేరకు) అనుగుణంగా వ్యవహరించారు. కనీసం నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు గనక ప్రధాని మోడీ అనుకున్న ప్రకారం చేసుకుంటూ పోవచ్చు. ఇక దత్తన్న స్థానంలో తెలంగాణ నుంచి చాలా పేర్లు వినిపించినా ఎవరినీ తీసుకోలేదు. ఎపి నుంచి హరిబాబుకు ఆహ్వానం అందిందని అన్ని మీడియా సంస్థలకూ వార్త అందింది గాని ఆయనకు పదవి అందింది లేదు. మరి ఈ తప్పు సమాచారం ఎవరు ఎక్కడ పుట్టించారు? ఆయనను ఎవరు పిలిపించారు? దత్తన్న స్థానంలో మురళీధరరావు, కిషన్‌రెడ్డి, వెదిరె శ్రీరాం ఇలా చాలా పేర్లు వినిపించాయి గాని అవన్నీ స్వార్థ పరుల ప్రచారాలేనని బిజెపి నేతలు కొట్టి పారేస్తున్నారు, మలి విడతలో ఏమైనా మరో అవకాశం ఇస్తారేమో చూడాలి.
ఇక పాత మంత్రులలో నిర్మలా సీతారామన్‌కు అందరి కంటే అదృష్టయోగం పట్టింది. అసలు తొలగింపుల జాబితాలో వున్నారన్న ఆమె కేబినెట్‌మంత్రిగా ప్రమోషన్ పొందడమే గాక కీలకమైన రక్షణ శాఖ పొందారు. అంటే ఇక పరోక్షంగా ప్రధాని కార్యాలయమే నిర్దేశిస్తుందన్నమాట. అత్యుత్సాహవంతులైతే ఆమె తమిళనాడు బిజెపిఅద్యక్షురాలే గాక ముఖ్యమంత్రి కూడా అవుతారని జోస్యాలు చెప్పారు. ఇవన్నీ తేలిపోగా మహిళగా ఆమె ఇందిరాగాంధీ తర్వాత తొలి రక్షణ మంత్రి అవుతున్నారు. విమర్శలకు గురైన కొందరిని నేరుగాతొలగించకుండా ఈ సందర్భంలో మార్చడం మోడీ గడుసుదనం. వరుస రైల్వే ప్రమాదాలతో దిగిపోతానన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభును తప్పించలేదు. నోట్లరద్దు పేరిట జరిగిన ఘోర వైఫల్యానికి అంతులేని కష్టనష్టాలకు ప్రధాని గాని ఆర్థిక మంత్రి గాని బాధ్యత తీసుకోలేదు.దేశంలో దిగజారిన శాంతి భద్రతలకు హోం మంత్రి బాధ్యత తీసుకోవడం లేదు. కనుక ఇదో రాజకీయ తతంగం మాత్రమే. కాకపోతే ఈ హడావుడితో నోట్లరద్దుపై జరగాల్సిన చర్చ వెనక్కుకోట్టగలిగారు.