ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను విడతల వారీగా వెల్లడిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో భాగంగా…తొలి రోజు.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి భారీ ప్యాకేజీ ప్రోత్సాహకాలు ప్రకటించారు. మొత్తం విభిన్న రంగాలకు అందిస్తున్న పధ్నాలుగు రకాల రిలీఫ్ మెజర్స్‌ను ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందులో చిన్న మధ్యతరహా సంస్థలకు 3 లక్షల కోట్ల రూపాయల సాయం వివిధ రూపాల్లో అందచేయనున్నామని ప్రకటించారు. మొత్తంగా ఆరు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి , రెండు ఈపీఎఫ్, రెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కోసం.. ఒకటి డిస్కమ్.. మరొకటి కాంట్రాక్టర్స్, ఒకటి రియల్ ఎస్టేట్ కి..మూడు పన్ను లాభాలకు సంబంధించిన రిలీఫ్‌లను ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద సాయం..!
45లక్షల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు తక్షణ లాభం కలిగేలా… ఎలాంటి గ్యారంటీలు, ఫీజులు అవసరం లేకుండా రుణాలు మంజూరు చేస్తారు. మూడు లక్షల వరకు ఆటోమేటిక్ రుణాలు లభ్యమవుతాయి. ఈ రుణం తీర్చడానికి నాలుగేళ్ల సమయం ఇస్తారు. ఓ ఏడాది వడ్డీ మారటోరియం కూడా ఉంటుంది. లాక్ డౌన్ వల్ల సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి ఉద్యోగాలు పోకుండా.. తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. ఈ సాయం చేస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే.. ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిచిపోయిన ఎంఎస్ఎంఈలకు రూ. 20వేల కోట్ల రుణాలు ఇస్తారు. నిర్వహణ సాయం కింద రూ. పదివేల కోట్లు రుణం కింద ఇందిస్తారు. అలాగే.. రూ. 50వేల కోట్ల ఈక్విటీ ఇన్ ఫ్యూజన్ అంటే.. వివిధ రూపాల్లో పెట్టుబడుల కింద అందిస్తారు. ఈ ప్రయోజనాలు పొందడానికి ఎంఎస్ఎంఈల అర్హతలను కూడా మార్చారు. అంతకు ముందు సేవా, ఉత్పాదక రంగాల పరిశ్రమలకు విడివిడిగా నిబంధనలు ఉండేవి. ఇప్పుడు.. టర్నోవర్ ఆధారంగా.. మాత్రమే ఎంఎస్ఎంఈలను గుర్తిస్తారు. రెండు వందల కోట్ల లోపు ఖర్చు పెట్టే అన్ని రకాల ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లు పిలువరు. భారత్‌కు చెందిన చిన్న సంస్థలకే అవకాశం కల్పిస్తారు. కరోనా కారణంగా మార్కెటింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందు ఎంఎస్ఎంఈలకు ఈ మార్కెట్ లింకేజీలు కల్పిస్తారు.
ఆర్థిక వ్యాపారాలకు అందుబాటులోకి కావాల్సినంత లిక్విడ్ క్యాష్..!
ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లకు కూడా.. సాయం ప్రకటించారు. రూ. 30వేల కోట్ల లిక్విడిటీ స్కీమ్ ఇవ్వబోతున్నారు. రూ. 45వేల కోట్ల పార్టియల్ లిక్విడిటీ గ్యారంటీ స్కీమ్ కూడా వారికి అందుబాటులోకి తెస్తున్నారు. దీని వల్ల గృహరుణాలు ఇతర.. వ్యక్తిగత రుణాలు ఇచ్చే సంస్థలకు లిక్విడ్ క్యాష్ అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రభుత్వ పనులు చేపుడుతున్న కాంట్రాక్టర్లకు ఆరు నెలల గడువు పొడిగించారు. కరోనాను యాక్ట్ ఆఫ్ గాడ్‌గా ప్రకటించి ఈ మేరకు వెసులుబాటు కల్పించారు. రెరా చట్టం కింద.. రియల్టర్లకు ఇబ్బందులు లేకుండా.. వెసులుబాటు కల్పించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పనులు పూర్తి కి మరో ఆరు నెలల గడువు పొడిగించారు.
టీడీఎస్ ఇరవై ఐదు శాతం తగ్గింపు..!
ఇక ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలకు రూ. 90వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. రుణాలను స్టేట్ గ్యారంటీలతో ఇస్తారు. ఇక పన్ను చెల్లింపు దారులకు కూడా ఊరట కల్పించారు. ప్రస్తుతం కడుతున్న టీడీఎస్‌లో ఇరవై ఐదు శాతాన్ని తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. దీని వల్ల టాక్స్ పేయర్లకు రూ. యాభై వేల కోట్ల ధనం అందుబాటులోకి వస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
రానున్న రోజుల్లో ఇతర రంగాలకు ప్యాకేజీల ప్రకటన..!
మొత్తంగా అన్ని రంగాలకు అవసరమైన ప్యాకేజీలు ప్రకటిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే తొలి రోజు పూర్తిగా.. మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు కేటాయించారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్రోత్సాహకాలు.. సంక్షోభంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడేవే. నిబంధనలు సరళీకరించడంతో.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ.. మూసివేత తప్పదనుకున్న సంస్థలకు బాగా ఉపయోగపడతాయి. మిగతా రిలీఫ్ ప్యాకేజీలు కూడా అన్ని రంగాలకు ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటున్నారు. మీడియా నుంచి అన్ని రంగాలు.. ఉద్దీపనల కోసం ఎదురు చూస్తున్నాయి.