ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ రోజు రైతులు , చిరు వ్యాపారులు, వలస కూలీల కోసం… సాయాన్ని ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. వలస కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న సన్నకారు రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. వలస కార్మికుల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సమయంలో… ప్రయారిటీగా.. వలస కార్మికుల విషయాన్ని నిర్మలా సీతారామన్ తీసుకున్నారు.
వలస కార్మికులకు కడుపు నిండా భోజనం.. చేయగలిగినంత ఉపాధి..!
వలస కార్మికులకు మూడు రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. అందులో మొదటిది.. వచ్చే రెండు నెలలకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వడం. రేషన్‌కార్డు లేని వాళ్లకు కూడా ఆహార ధాన్యాలు అందేలా నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా 8 కోట్ల మంది వలస కార్మికులు లబ్ధి పొందబోతున్నారు. ఇందు కోసం కేంద్రం రూ. 3500 కోట్లు ఖర్చు చేస్తోంది. కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని అందరికీ ఆహార ధాన్యాలు అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే.. దేశంలో రేషన్ కార్డులు ఎక్కడైనా వాడుకునే వీలు కల్పించామని వన్ నేషన్-వన్ రేషన్ కార్డు స్కీమ్ ద్వారా 67 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు.
సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్తున్న వలస కూలీల ఉపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 40 నుంచి 50 శాతం అదనంగా పనిదినాలు కల్పిస్తున్నామని.. సొంత ప్రాంతాల్లో నరేగా లాంటి పనుల్లో చేరేందుకు అవకాశం కల్పించామన్నారు. కార్మికుల కోసం తాము ఏ చర్యలు తీసుకుంటున్నామో నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే విపత్తు నిర్వహణ నిధులను వలస కార్మికులు, పట్టణ పేదలకు భోజన వసతి కల్పించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. రెండు నెలల్లో 11 వేల కోట్లు కేంద్రం నిధులు ఖర్చుపెట్టుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పించారు.
రైతులకు రూ. రెండు లక్షల కోట్ల వడ్డీ రాయితీ రుణాలు..!
రైతులకు కూడా.. ప్యాకేజీలో రుణ సాయం ప్రకటించారు నిర్మలా సీతారామన్. గత మూడు నెలల్లో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగిస్తున్నామన్నారు. మొత్తంగా రెండున్నరకోట్ల చిన్న, సన్నకారు రైతులకు రెండు లక్షలకోట్లు రాయితీ రుణాలుగా ఇస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మార్చి 1 నుంచి మే 31 వరకు రైతుల రుణాలపై వడ్డీ ఉండదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పథకం కింద… నగదు బదిలీ సాయాన్ని పెంచుతారని చాలా మంది ఆశించారు కానీ.. రుణసాయంతోనే నిర్మలా సరి పెట్టారు.
చిన్న, వీధి వ్యాపారులకు రూ. 1.62 లక్షల కోట్ల రుణాలు..!
ఇక చిన్న వ్యాపారులకు కూడా.. ప్యాకేజీ ప్రకటించారు. ముద్ర రుణాల్లో భాగంగా రూ.1.62 లక్షల కోట్లు కొత్తగా అందించబోతున్నామని.. 3 కోట్ల మంది దీని వల్ల ప్రయోజనం పొందుతారని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా రూ.50 వేలు అంతకంటే తక్కువ ముద్ర రుణాలు ఇస్తామన్నారు.
రూ.5 వేల కోట్లతో వీధి వ్యాపారులకు ప్రత్యేక రుణ సదుపాయం కల్పిస్తున్నారు.కరోనా ప్రభావంతో జీవనాధారం దెబ్బతిన్న వీధి వ్యాపారులకు నెల రోజుల్లో రుణాలు ఇస్తామన్నారు. లాక్డౌన్ పూర్తికాగానే తమ వ్యాపారాలను ప్రారంభించడానికి.. 50 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సదుపాయం ఉపయోగపడుతుందని ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు.
మధ్యతరగతి ప్రజల ఇంటి స్వప్నం నెరవేర్చుకోవడానికి కొత్త పథకం..!
ఇక మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కొనుగోలు చేసేందుకు కూడా ప్యాకేజీ ప్రకటించారు. మార్చి 2021 వరకు ఈ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అందుబాటులోకి వస్తుందని.. ఇళ్లు కొనుక్కోవాలనుకునేవారికి ఈ పథకం ద్వారా ప్రత్యేక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2.5 లక్షల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిపొందుతాయన్నారు. మధ్యతరగతి వర్గానికి ఇళ్లు సమకూరడంతో పాటు.. రియల్ ఎస్టేట్‌కు ఊపు తెచ్చేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది.