మోటార్లకు మీటర్లు పెట్టాలని రైతుల మెడకు ఉరి తాళ్లు వేయాలని బీజేపీ సర్కార్ చాలా కాలంగా వేధిస్తోందని అప్పులు ఇవ్వడం లేదని .. పాతిక వేల కోట్లు నష్టపోయినా సరే మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని బీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీని కార్నర్ చేయడానికి ఇదో గట్టి అంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీకి ప్రచారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన నిర్మలా సీతారామన్ ఈ అంశంపై స్పందించారు.
బీఆర్ఎస్ మోటార్లకు మీటర్లు పెట్టలేదని అందుకే అప్పులు ఆపేశామని గొప్పగా చెప్పారు. నిర్మలా సీతారామన్ మాటలతో బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు.. సాహో నిర్మలమ్మ అని.. బీజేపీపై ఎటాక్ ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్ఎస్ రాకపోతే మోటార్లకు మీటర్లు వస్తాయని.. ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా తాము మోటార్లకు మీటర్లు పెట్టబోమని హామీ ఇస్తున్నారు. కేసీఆర్ రైతుల కోసం ఎంత కష్టమైనా భరిస్తారనేదానికి.. నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనే నిదర్శనమంటున్నారు. నిర్మలాసీతారామన్ ప్రకటన.. బీఆర్ఎస్ కు మేలు చేసేలా ఉండటంతో బీజేపీ నేతలు డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు.
నిజానికి కేంద్రం ఖచ్చితంగా మీటర్లు పెట్టాలని చెప్పలేదు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలని కోరింది. మీటర్లు పెట్టాలా లేదా అనేది ఆప్షన్ గానే ఉంచిందని గతంలో బీజేపీ ఎదురుదాడి చేసింది. ఇప్పుడు.. నిర్మలా సీతారామన్.. కేసీఆర్ రైతుల కోసం ఏదో చేశారని.. కేంద్రమే తప్పు చేసిందన్నట్లుగా ప్రకటన చేయడంతో బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.