కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆమె భర్త పరకాల ప్రభాకర్ మధ్య సైద్ధాంతిక వైరధ్యం మీడియాకు ఎక్కింది. పరకాల ప్రభాకర్.. బీజేపీ ఆర్థిక విధానాలను విమర్శిస్తూ.. ది హిందూ పత్రికలో.. ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారు. నేరుగా కాకపోయినా.. ఆర్థిక మంత్రిగా తన భార్య నిర్మలా సీతారామన్ తీసుకుంటున్న చర్యలను తప్పు పట్టారు. నిర్మలా సీతారమన్ దేశ ఆర్థిక వ్యవస్థ బేషుగ్గా ఉందని.. మందగమనం నుంచి జెట్ స్పీడ్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. వారానికో రంగానికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇవి ఆర్థిక వ్యవస్థకు.. ప్రజలకు ఎంత మేర లాభం చేస్తున్నాయో కానీ… నిపుణులు, మేధావులుగా పేరు తెచ్చుకున్న వారెవరికీ నచ్చడం లేదు.
ఆ మేధావులు, నిపుణుల్లో.. నిర్మలా సీతారామన్ భర్త.. పరకాల ప్రభాకర్ కూడా చేరడమే …అసలు ట్విస్ట్. పీవీ, మన్మోహన్ విధానాలే బాగా ఉండేవని పరకాల పొగిడేశారు. ఈ విషయంలో ఢిల్లీలో కలకలం రేపడంతో.. మీడియా ప్రతినిధులు.. నిర్మలా సీతారామన్ స్పందన కోసం .. ఎదురు చూశారు. ఆమె దీనిపై చాలా కూల్ గా స్పందించారు. అసలు గత ఐదేళ్లలో తాము చేపట్టిన సంస్కరణల వల్లే ఫలితాలొస్తున్నాయని చెప్పుకున్నారు. పరకాల ప్రభాకర్ ప్రస్తుతం బీజేపీలో లేరు. ఒకప్పుడు బీజేపీలో ఉండేవారు. తర్వాత పీఆర్పీలో ఉన్నారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు… మీడియా సలహాదారుగా కీలక పాత్ర పోషించారు. బీజేపీతో టీడీపీ కటిఫ్ చెప్పిన తర్వాత.. విమర్శలు రావడంతో.. పదవిని వదులుకున్నారు.
అయితే.. బీజేపీలో మాత్రం చేరలేదు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎలాంటి కామెంట్లు చేయలేదు. హఠాత్తుగా… దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. మామూలుగా అయితే. పరకాల ఆర్థిక అంశాల్లో పట్టున్న నిపుణుడే. కానీ భార్య ఆర్థిక మంత్రిగా ఉన్న శాఖకు సంబంధించి.. ఆమె … ఎప్పటికప్పుడు… కొత్త నిర్ణయాలు ప్రకటిస్తున్న సమయంలో… వ్యతిరేక ప్రకటనలు చేయడం కలకలం రేపుతోంది. భార్య ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు.. పరకాల ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.