లాక్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగితే… విడుదల కాని కొత్త సినిమాలు ఓటీటీకి అంత దగ్గర అవుతుంటాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీని నమ్ముకున్నాయి. థియేటర్ల కంటే ముందుగా ఓటీటీలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కొన్ని పెద్ద సినిమాలపై సైతం ఓటీటీ గురి వుంది. `మీ సినిమాలు థియేటర్లో విడుదల కావడం చాలా కష్టం. మా ఓ టీ టీ లో విడుదల చేసుకోండి` అంటూ ఓటీటీ వేదికలు సంప్రదిస్తున్నాయి. ఓటీటీ ప్యాకేజీ కూడా కాస్త టెమ్ట్ చేస్తుండడంతో కొన్ని సినిమాలు ఓటీటీ బుట్టలో పడిపోయాయి. `నిశ్శబ్దం` చిత్రానికీ మంచి ఆఫర్లే వస్తున్నాయి. ఏప్రిల్ 2న విడుదల కావల్సిన సినిమా ఇది. లాక్ డౌన్ వల్ల.. నిరవధికంగా వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తేస్తే… విడుదల కావల్సిన సినిమాల్లో నిశ్శబ్దం ముందు వరుసలో ఉంటుంది.
దక్షిణాది భాషలతో పాటుగా, హిందీలోనూ ఈ సినిమాని విడుదల చేద్దామనుకుంటున్నారు. అన్ని భాషలకూ చెందిన నటీనటులు ఉండడంతో.. ఆ సౌలభ్యం ఈ సినిమాకి వుంది. అదే ఓటీటీనీ ఆకర్షిస్తోంది. మిగిలిన భాషల్లోనూ ఈ సినిమా చూస్తారన్న నమ్మకంతో కాస్త ఆకర్షణీయమైన ప్యాకేజీతోనే దర్శక నిర్మాతల్ని అమేజాన్ లాంటి సంస్థలు సంప్రదించాయి. అయితే నిర్మాతలు మాత్రం ఓటీటీ విడుదలకు ససేమీరా అంటున్నారు. జూన్ లోగా పరిస్థితులు చక్కబడతాయని, థియేటర్లు కూడా తెరచుకుంటాయని వాళ్ల నమ్మకం. అందుకే ఓటీటీ ఆఫర్ ని నిర్మొహమాటంగా తోసి పుచ్చింది.