లాక్ డౌన్ లేకపోతే.. ‘నిశ్శబ్దం’ ఈ పాటికి విడుదలైపోయేదే. కానీ… అన్ని సినిమాల్లానే ఆగిపోయింది. విడుదల కావల్సిన సినిమాలు ఆగిపోవడంతో ఓటీటీ సంస్థలు ఆయా చిత్రాల వెంట పడ్డాయి. ”మాకు అమ్ముకోండి.. మంచి రేటు ఇస్తాం” అంటూ బేరం పెట్టాయి. అలాంటి సినిమాల జాబితాలో `నిశ్శబ్దం` కూడా ఉంది. నిశ్శబ్దం సినిమాని ఓటీటీలోనే విడుదల చేస్తారంటూ జోరుగా ప్రచారం జాగింది. అయితే… ఈ వార్తల్ని చిత్రబృందం ఖండించింది. ”థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాం” అని ప్రకటించింది. అయితే.. ఇప్పుడు ఓటీటీ విషయంలో ఈ సినిమా మొత్తబడుతున్నట్టే అనిపిస్తోంది. చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ మాటలు వింటుంటే ‘ఓటీటీ వైపు నిశ్శబ్దం మొగ్గు చూపుతోంద’ని రూఢీ అవుతోంది.
ఈ విషయంపై హేమంత్ మాట్లాడారు. తమకూ ఓటీటీ ఆఫర్లు వచ్చాయని, అయితే.. చిత్రబృందం అంతా థియేటర్లలోనే విడుదల చేయడానికి ఆసక్తి చూపించదని, అయితే..తెలుగు వెర్షన్ మాత్రమే పూర్తయిందని, తమిళ, మలయాళ, హిందీ వెర్షన్‌కి సంబంధించిన కొన్ని పనులు మిగిలిపోయాయని, అవన్నీ అయ్యాక ఈ సినిమా విడుదల విషయంలో మళ్లీ పునరాలోచిస్తామని ఆయన చెబుతున్నారు. ”లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుందో చెప్పలేం. లాక్ డౌన్ ఎత్తేశాక పరిస్థితుల్ని ఇప్పుడే అంచనా వేయలేం. ఆయా పరిస్థితుల్ని బట్టి తమ సినిమాల్ని థియేటర్లో ఆడించుకోవాలా, లేదంటే ఓటీటీకి ఇచ్చుకోవాలా అనేది దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. మెజార్టీ ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తే.. మేం కూడా అదే దారిలో వెళ్తాం” అని చెప్పుకొచ్చారు. సో… నిశ్శబ్దం ఓటీటీలో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట.