ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇక రాదనే చేదు నిజాన్ని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ మానసికంగా జీర్ణించుకొంటున్న ఈ సమయంలో మళ్ళీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రత్యేక హోదాపై ఆశలు రేకెత్తిస్తున్నట్లుగా మాట్లాడారు.
శుక్రవారం కడపలో పర్యటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసే విషయంపై నీతి ఆయోగ్ తన నివేదికని ప్రధాని నరేంద్ర మోడికి సమర్పించింది. ప్రస్తుతం అది ప్రధాని మోడి పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆయన దానిపై ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది,” అని చెప్పారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా దానిని దృవీకరిస్తూ “దీనిపై ప్రధాని త్వరలోనే సముచితమయిన నిర్ణయం తీసుకొంటారు,” అని మీడియాకి తెలిపారు.
ప్రత్యేక హోదా విషయంలో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేసినందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ప్రత్యేక హోదా రాదని మానసికంగా అంగీకరిస్తున్న సమయంలో మళ్ళీ కేంద్రమే ఈ అంశం గురించి ప్రస్తావించడం ద్వారా కొత్త సమస్యలను ఆహ్వానించుకొంటున్నట్లుంది. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి మంజూరు చేస్తామని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చి సుమారు ఏడెనిమిది నెలలు కావస్తోంది. కేంద్రప్రభుత్వం కనీసం ఆ హామీని కూడా ఇంతవరకు నేరవేర్చలేకపోయింది.
మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం మొదలుపెట్టడం వలన ప్రజలకు మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికి దానిపై కారం చల్లినట్లవుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి ఇవ్వడం సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొందని కేంద్రప్రభుత్వం తేల్చి చెపితే రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే 20 నెలలు గడిచిపోయాయి. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని కేంద్రప్రభుత్వం చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.