తెలంగాణకు సంబంధించి నైజాం ఏరియాలో సినిమాల డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు, హీరో నితిన్ సుధాకర్ రెడ్డి మధ్య ఒకానొక సమయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచిందని ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటారు. ఈ కారణం చేతే నితిన్‌కి ‘దిల్’ వంటి హిట్ ఇచ్చిన ‘దిల్’ రాజు, అతడితో మరో సినిమా చేయలేదని చెప్పుకుంటారు. ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ల తర్వాత నితిన్ హీరోగా దిల్ రాజు ‘శ్రీనివాస కళ్యాణం’ నిర్మిస్తున్నాడు. ఇన్నేళ్లలో వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయకపోవడానికి గల కారణాలను నితిన్ పుట్టినరోజు సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. “దిల్ సినిమా చేసిన తరవాత రాజుగారితో మరో సినిమా చేయుడానికి ఎన్నో ప్రయుత్నాలు జరిగాయి. అయితే… మా మధ్య ఉన్న కొంతమంది పుల్లలు పెట్టారు. అవన్నీ క్లియర్ కావడానికి కాస్త టైమ్ పట్టింది” అన్నాడు నితిన్. ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ని జూలై 24న విడుదల చేయనున్నారు. దీని తరవాత దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయనున్నట్టు నితిన్ తెలిపాడు. ఆ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తారట.