అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈవారంలోనే నితిన్ పెళ్లి జరిగిపోయేది. ఈరోజు (ఆదివారం) నితిన్‌ని పెళ్లి కొడుకుని చేసేవాళ్లు. ఎంచక్కా దుబాయ్‌లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని, హైదరాబాద్ లో ఘనంగా విందు ఇచ్చేవాడు. కానీ కరోనా వల్ల అన్నీ మారిపోయాయి. నితిన్ పెళ్లి వాయిదా పడింది. అయినా నితిన్ బెంగ పడడం లేదు. బాధ పడడం లేదు. ”అన్నింటికంటే ప్రాణాలే ముఖ్యం. పెళ్లి అనేది గొప్ప వేడుక. జీవితంలో ఒక్కసారే జరుగుతుందని దాన్ని భయాల మధ్యన, మాస్కులు పెట్టి చేసుకోకూడదు. అందుకే ఇష్టపూర్వకంగానే వాయిదా వేశా” అంటున్నాడు. లాక్ డౌన్ ముందు పెళ్లి, సినిమాలు, షూటింగులు అన్నీ చిన్నవే అని, ఓ సినిమా పోతే మరో సినిమా చేసుకోవచ్చని, డబ్బులు మళ్లీ సంపాదించుకోవచ్చని, ప్రాణాలు మాత్రం మళ్లీ రావని చెప్పుకొచ్చాడు నితిన్.
ఈ లాక్ డౌన్ వేళ అందరి దినచర్యలూ మారిపోయాయి. నితిన్ డైరీ కూడా అంతే. జిమ్‌లు కట్టిపెట్టేశాడట. డైట్‌ని పక్కన పెట్టి అమ్మ చేతి వంట తింటూ.. కాలక్షేపం చేస్తున్నాడట. స్నేహితులంతా వంట గదిలో దూరి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారని, తాను కూడా రేపో మాపో గరిట పట్టుకుంటానని అంటున్నాడు. రాత్రి రెండింటి వరకూ మేల్కొని సినిమాలు చూస్తున్నానని, తెల్లారి 11 గంటలకు నిద్ర లేస్తున్నానని లాక్ డౌన్ వల్ల తన దినచర్య మొత్తం మారిపోయిందని అంటున్నాడు నితిన్.