వి… ఓటీటీలో విడుదలైంది. నిశ్శబ్దం, ఓరేయ్ బుజ్జిగా రెండూ అదే బాట పట్టాయి. నితిన్ సినిమా `రంగ్ దే` కూడా ఓటీటీలోనే విడుదల అవుతోందని ప్రచారం జరుగుతోంది. జీ 5 ఈ సినిమా హక్కుల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అయితే నితిన్ మాత్రం ఓటీటీకి `నో` చెబుతున్నట్టు తెలుస్తోంది. ఓటీటీ ఫలితాలు సానుకూలంగా లేకపోవడం, త్వరలోనే థియేటర్లు తెరచుకునేందుకు పుష్కలంగా అవకాశాలు ఉండడంతో నితిన్ అడ్డు చెబుతున్నట్టు సమాచారం.
మరోవైపు జీ 5తో బేరం కూడా అంత ఈజీగా తెగేట్టు కనిపించడం లేదు. `రంగ్ దే` హక్కుల రూపంలో నిర్మాతలు ఏకంగా 40 కోట్ల వరకూ కోడ్ చేసినట్టు తెలుస్తోంది (ఓటీటీ, శాటిలైట్ రెండూ కలిపి). కానీ జీ 5 మాత్రం 28 కోట్లు ఇస్తానంటోందట. రెండింటికీ పెద్ద మార్జినే ఉంది. కాబట్టి బేరం తెగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు… `రంగ్ దే` షూటింగ్ ఇంకా బాకీ ఉంది. త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకోవడానికి ఇటలీ వెళ్లబోతోంది చిత్రబృందం. అక్కడికి వెళ్లి, వచ్చాక… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలూ పూర్తయ్యాక – అప్పుడు ఓటీటీ విషయంలో ఓ నిర్ణయానికి వస్తుంది. ఈలోగా థియేటర్లు తెరచుకుని, వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉందన్నది నితిన్ నమ్మకం.