పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమా హక్కులను మరోసారి దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని, హీరో నితిన్. పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాడు నితిన్. ఆసియన్ ఫిల్మ్స్, శ్రేష్ఠ్ మూవీస్ కలిసి ‘కాటమరాయుడు’ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు.
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూషన్ లో వున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అరవింద్ లతో పోల్చుకుంటే ఆయన జోరు ఈ మధ్య తగ్గినట్లు కనిపించింది. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా అంటే నైజాం హక్కులు ఆయన ఖాతలోకే వెళుతుంటాయి. అత్తారింటికి దారేది నుండి మొన్న వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ వరకూ’శ్రేష్ఠ్ మూవీస్’ కే నైజాం హక్కులు దక్కాయి. సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికి వస్తే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం నైజాం లో రికార్డు ధరకు పలికాయి. దాదాపు దాదాపు రూ.23 కోట్లకు వెళ్లాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా నిరాశ పరిచింది. ఆ సమయంలోనే ”తర్వాత సినిమాకి చూద్దాం” అని పవన్ డిస్ట్రిబ్యూటర్లకు మాటచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్లే సర్దార్ డిస్ట్రిబ్యూటర్లకే తొలి ప్రాధాన్యత ఇస్తూ బిజినెస్ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ‘కాటమరాయుడు’ పై కూడా భారీ అంచనాలు వున్నాయి. ఇటివలే రిలీజైన ఈ చిత్రం టీజర్ సంచలనం రేపింది. టీజర్ రెస్పాన్స్ తో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఇప్పటికే అర్ధమైపోయింది. కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.