టాలీవుడ్ లోని ప్రామిసింగ్ హీరోల్లో నితిన్ ఒకడు. అన్ని కలిసొచ్చిన వేళ.. సూపర్ హిట్లు కొట్టగలడు. తన సినిమాకి ఓపెనింగ్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి. సినిమాని ప్రమోట్ చేసుకోవడం కూడా తనకు బాగా తెలుసు. చేతిలో శ్రేష్ట్ మూవీస్ ఉంది. సో.. ఎలా చూసినా నితిన్ ది ఢోకా లేని కెరీరే. అయితే.. `భీష్మ` తరవాత సాలిడ్ హిట్టు కొట్టలేకపోయాడు. వరుసగా అన్నీ పరాజయాలే. `మాచర్ల నియోజకవర్గం` అయితే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ ఫ్లాపు నితిన్ ని మరింత కన్ఫ్యూజన్లో పడేసింది.
మాచర్ల తరవాత.. వక్కంతం వంశీ `జూనియర్` సినిమాని పట్టాలెక్కించాలి నితిన్. అది కూడా శ్రేష్ట్ మూవీస్ సినిమానే. ఆమధ్య క్లాప్ కొట్టుకొన్న ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇప్పటి వరకూ లేదు. ముందు అనుకొన్న ప్రకారమైతే అక్టోబరులోనే షూటింగ్ ఉండాలి. కానీ.. నితిన్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. అందుకే ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభించాలన్న విషయంలో ఇంకా సందిగ్థంలో ఉన్నాడు. సాగర్ చంద్ర కూడా నితిన్‌కి ఓ కథ చెప్పాడు. అది నితిన్‌కి బాగా నచ్చింది. `అశ్వద్ధామ` దర్శకుడు కూడా నితిన్ కి టచ్‌లో ఉన్నాడు. వీళ్లు కాకుండా మరో ఇద్దరు దర్శకులతోనూ నితిన్ డిస్కర్షన్స్‌లో ఉన్నాడు. వీటిలో ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో నితిన్ కనిపిస్తున్నాడని టాక్. `మాచర్ల..` కూడా సొంత బ్యానర్లో తీసిందే. ఆ ఫ్లాప్ తరవాత సొంత బ్యానర్లో మరో సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. వనరుల్ని సమకూర్చుకోవాలి. అందుకే వక్కంతం వంశీ సినిమాని కాస్త వెనక్కి తీసుకెళ్లి, బయటి నిర్మాతతో ఓ సేఫ్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నాడట. అదే జరిగితే వక్కంతం సినిమా ఈ యేడాది లేనట్టే. ముందు సాగర్ చంద్ర సినిమా పట్టాలెక్కించి, ఆ తరవాత వక్కంతం కథని సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. కానీ సాగర్ చంద్రతో సినిమా అంటే.. ఆసినిమాకి మైలేజీ వస్తుందా, రాదా? అనే అనుమానం కూడా పీకుతోంది. తన తరం హీరోలంతా పేరున్న దర్శకులతో సినిమాలు చేస్తూ క్రేజ్ తెచ్చుకొంటున్నారు. నితిన్ మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడ్డాడు. ఇప్పుడు అర్జెంటుగా తన సినిమాకి క్రేజ్ తీసుకొచ్చే దర్శకుడు కావాలి. ఆ వేటలోనే నితిన్ ఉన్నాడు.