నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకొన్నా – ఇప్పుడు ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు నితిన్. ఎందుకంటే నితిన్ కొత్తగా రెండు ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు. ఓ సినిమా వెంకీ కుడుములతో చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. మరోవైపు వేణు శ్రీరామ్ చెప్పిన కథకూ నితిన్ ఒప్పుకొన్నాడని టాక్. వక్కంతం వంశీ సినిమా పూర్తి చేస్తే తప్ప… ఈ రెండు సినిమాల్ని మొదలెట్టడానికి లేదు. ఎందుకంటే వక్కంతం సినిమాలో నితిన్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. మధ్యలో మరో సినిమా చేస్తే.. గెటప్పుల్లో తేడా వస్తుంది. అందుకే ముందు వక్కంతం సినిమాపై ఫోకస్ పెట్టాడు.
ఈ సినిమాకి ఇప్పటి వరకూ టైటిల్ ఖరారు కాలేదు. `జూనియర్`, `ఎంటర్టైనర్` అనే రెండు పేర్లు యటకు వచ్చాయి. కానీ అవి రెండూ కేవలం వర్కింగ్ టైటిల్సే. ఇప్పుడు `సైతాన్` అనే మరో పేరు బయటకు వచ్చింది. అయితే ఇది కూడా ఖరారు కాదు. కేవలం అనుకొంటున్నారంతే. ఈ సినిమాలో నితిన్ రెండు వేర్వేరు గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. అందులో ఓ పాత్రకు `సైతాన్` అనే పేరుంది. దాన్నే సినిమా టైటిల్ గా పెడితే బాగుంటుందన్నది వంశీ ఆలోచన. కాకపోతే… అధికారికంగా మాత్రం ఖరారు చేయలేదు. సినిమా పూర్తవ్వడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి.. ఈలోగా మరో మంచి పేరు తడితే.. దాన్నే ఫైనల్ చేస్తారు.