ఈమధ్య చాలా సినిమాలు బడ్జెట్ సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ముందు అనుకొన్న బడ్జెట్ ఒకటి. చివరికి అయ్యేది ఇంకొకటి. పాన్ ఇండియా మార్కెట్ వల్ల, డిజిటల్ మార్కెట్ పెరగడం, ఓటీటీ రూపంలో డబ్బులు దండిగా రావడంతో… బడ్జెట్ పెరిగినా ఫర్వాలేదనుకొంటున్నారు. దాంతో.. లెక్కలు తప్పుతున్నాయి. తాజాగా నితిన్ సినిమాకీ ఇదే పరిస్థితి ఎదురైంది. నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `మాచర్ల నియోజకవర్గం`. ఈ సినిమాని నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్‌నే తెరకెక్కిస్తోంది. సొంత సినిమా అనేసరికి హీరోలు పొదుపుగా వ్యవహరిస్తారు. వీలైనంత తక్కువలో సినిమా తీయాలని అనుకొంటారు. కానీ ఈ సినిమా విషయానికొస్తే సీన్ రివర్స్ అయ్యింది. ముందు అనుకొన్న బడ్జెట్ కంటే 30 శాతం ఖర్చు పెరిగిపోయింది. దానికి రకరకాల కారణాలున్నాయి. దర్శకుడికి ఇదే తొలి సినిమా. మేకింగ్ పరంగా.. కొన్ని సమస్యలు ఉంటాయి. బెటర్ మెంట్ కోసం రీషూట్లు చేయడం వల్ల కూడా బడ్జెట్ అదుపు తప్పిందని తెలుస్తోంది. `మాచర్ల..`పై నితిన్ గట్టిగా నమ్మకాలు పెట్టుకొన్నాడు. సొంత బ్యానర్లో వస్తున్న సినిమా కాబట్టి.. ఇంకాస్త కేర్ పెరిగింది. అందుకే.. బడ్జెట్ పెరిగినా నితిన్ పట్టించుకోవడం లేదని టాక్. ఎంత ఖర్చు పెట్టి తీసినా, సినిమా బాగుంటే చాలు అనుకొంటున్నాడట. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో?