ఈమధ్య ఓటీటీ సినిమా అనగానే.. హీరోలు భయపడుతున్నారు. నేరుగా ఓటీటీలో సినిమా విడుదల చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. `థియేటర్లో సినిమా చూసే అనుభవం వేరు..` అంటూ ఓటీటీకి నో చెబుతున్నారు. ఓ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తే.. తమ మైలేజీ తగ్గుతుందన్న భయం ఉంది. నిర్మాతలకు డీల్ నచ్చినా, కేవలం హీరోల ఈగోల్ని సంతృప్తి పరచడానికి.. వాళ్లు కూడా ఓటీటీలకు అమ్ముకోకుండా, థియేటర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నారు.
ఈదశలో నితిన్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొత్త సినిమా `మాస్ట్రో`ని ఓటీటీలోకి విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో `మాస్ట్రో` నిర్మాతలు హాట్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకుని.. డీల్ సెట్ చేయగలిగారు. థియేటర్లో సినిమా విడుదలైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు వస్తారో, రారో చెప్పలేం. సినిమా హిట్టయితే ఫర్వాలేదు, ఫ్లాప్ అనే టాక్ వస్తే – పెట్టుబడి మొత్తం గోవిందా. ఓటీటీ అలా కాదు. పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చేస్తోంది. టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంది. నిర్మాతలకు సేఫ్ లో ఉంటారు. థియేటరికల్ రిలీజ్ అనేది జూదమే. డబ్బులు వస్తాయో, రావో చెప్పలేం. అలాంటప్పుడు ఓటీటీల్ని నమ్ముకుని నిర్మాతల్ని సేఫ్ జోన్ లో ఉంచడమే మంచిది. నితిన్ ఇప్పుడు అదే చేశాడు. ఈ విషయంలో మాత్రం నితిన్ కి మెచ్చుకోవాల్సిందే.